కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భద్రత కల్పించే న్యూన్‌తమ్ ఆయోజనను ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ 50ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న పుత్తుపల్లి శాసనసభ నియోజకవర్గంలో రాహుల్ ప్రచారం నిర్వహించారు.
పేదల ఖాతాల్లోకి రూ.72వేలు..
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదులుగా అభివర్ణిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దేశంలో హింస, విద్వేషం పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యూన్‌తమ పథకం ద్వారా పేదల బ్యాంకు ఖాతాల్లోకి ఏడాదికి 72వేల రూపాయలు నేరుగా చేరుతాయని తెలిపారు. పెద్ద నోట్ల రద్దుతో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్ధను మెరుగుపర్చేందుకు ఇలాంటి పథకాలను అమలు చేయడమే ఏకైక మార్గమని చెప్పారు.
''ఆందోళన చేస్తున్న రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉగ్రవాదులు అని అన్నారు. దేశంలో వామపక్షాలు, ఆర్.ఎస్.ఎస్ విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయి. హింస, ద్వేషము పెరుగుతోంది. ఇంతటి విద్వేషం ఎందుకు?. భారతదేశం ఇంతటి ఆగ్రహంతో ఎందుకు ఉంది?. దేశంలో మహిళలు సొంతంగా బయటకు వెళ్లలేకపోతున్నారు?. కేరళకు కాంగ్రెస్ పార్టీ దిశను, సామరస్యాన్ని అందిస్తాం. ప్రజల జేబుల్లో నేరుగా డబ్బులు వేస్తాం.''
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఇదీ చదవండి: 'ప్రజల జేబులను కొల్లగొడుతున్న ప్రభుత్వం'