Punjab assembly election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక్కడ బహుముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో.. నామినేషన్ల పర్వం ఊపందుకుంది. అయితే ఈ సందర్భంగా సమర్పించే అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా.. ఎందమంది కోటీశ్వరులు పోటీలో నిలుస్తున్నారనే వార్త ప్రధానంగా వినిపిస్తుంటుంది. అయితే పంజాబ్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందనేది చర్చనీయాంశమైంది.
పంజాబ్‌లో డబ్బు, స్థిరాస్తులకు బదులుగా బంగారాన్ని స్టేటస్‌గా చూస్తారట. అందుకే బడా నేతలు ఆస్తులను చూపించే కంటే.. తమ నామినేషన్ అఫిడవిట్లో పసిడిని ప్రముఖంగా చూపించేందుకు ఆసక్తిని కనబరుస్తారట. 2022 అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఈ విషయం మరోసారి రుజువైంది.
బాదల్ కుటుంబాన్ని వెనక్కి నెట్టి..
2017 ఎన్నికల వరకు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ కుటుంబ సభ్యులు వద్ద ఎక్కువ మొత్తం విలువ చేసే బంగారం, వజ్రాల ఆభణాలు ఉండేవి. అయితే ఈసారి లెక్క మారింది.
బాదల్ కుటుంబం రెండోస్థానానికి పడిపోగా.. సంగ్రూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న భాజపా అభ్యర్థి అరవింద్ ఖన్నా ఫ్యామిలీ మొదటి స్థానంలో నిలిచింది. ఖన్నాతో పాటు అతని భార్య వద్ద రూ.9.70 కోట్ల విలువైన నగలు ఉన్నాయి. ఖన్నా వద్ద రూ.5.31 కోట్లు.. ఆయన భార్య రూ.4.39 కోట్ల విలువైన నగలు కలిగి ఉన్నారు. అయితే ఈ విలువలు ప్రస్తుత ధరలతో లెక్కించినవి కావు. ఇప్పుడు వారి వద్ద 19.50 కిలోల బంగారం ఉంది.
శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన బాదల్ కుటుంబం వద్ద రూ.7.33 కోట్లు విలువైన నగలు ఉన్నాయి. అందులో ఒక్క హర్సిమ్రత్ కౌర్ బాదల్ వద్దనే రూ.7.24 కోట్లు విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆభరణాలు వారసత్వంగా వచ్చాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సుఖ్బీర్ సింగ్ బాదల్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. కుటుంబ సభ్యుల వద్ద రూ. 6.11 కోట్లు విలువైన బంగారం, వెండి, వజ్రాల ఆభరణాలు ఉన్నాయి. అప్పుడు బంగారం ధర 10 గ్రాములు రూ. 29000 పైనే ఉంది. అయితే ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర 49000 వరకు పలుకుతోంది.
మూడోస్థానంలో మంత్రి
ఇసుక తవ్వకాలకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ మంత్రి గుర్జీత్ సింగ్ ఈ జాబితాలో మూడోస్థానంలో ఉన్నారు. గుర్జీత్ సింగ్ కుటుంబం వద్ద 2.28 కోట్ల నగలు ఉన్నాయి. ఈయన వ్యాపారవేత్త కూడా.
జిరా నియోజకవర్గం నుంచి అకాలీదళ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జన్మేజా సింగ్ సెఖోన్.. ఈ విషయంలో తాను కూడా తక్కువేం కాదని అంటున్నారు. తన కుటుంబం వద్ద రూ.1.54 కోట్లు విలువైన నగలు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు సెఖోన్.
ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టుకున్న పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్ కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ కుటుంబం వద్ద రూ.1.43 కోట్లు విలువైన ఆభరణాలు ఉన్నాయట. ఈయన పటియాలా నుంచి పోటీ చేస్తున్నారు.
ఆప్‌లోనూ..
సామాన్యలకు ప్రతినిధిగా చెప్పుకునే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు కూడా ఎక్కువ మొత్తంలో బంగారం చూపించుకునే విషయంలో పోటీ పడ్డారు.
ఆమ్ ఆద్మీ పార్టీ సునమ్ అభ్యర్థి అమన్ అరోరా.. తన కుటుంబ సభ్యుల వద్ద 1.87 కిలోల బంగారంతో సహా రూ.1.27 కోట్ల విలువైన నగలు ఉన్నట్లు తన అఫిడవిట్లో వెల్లడించారు.
అయితే ఈ ఎన్నికల్లో అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా పేరొందిన కుల్వంత్ సింగ్ రూ. 250 కోట్ల విలువైన చరాస్తులు, స్థిరాస్తులను కలిగి ఉన్నారు. ఆయన ఆమ్ ఆద్మీ పార్టీ టికెట్‌పై మొహాలీ నుంచి పోటీ చేస్తున్నారు. కుల్వంత్ కుటుంబం వద్ద రూ. 63.44 లక్షల విలువైన బంగారు, వజ్రాల నగలు మాత్రమే ఉండటం విశేషం.
ఆభరణాలను చూపించడంలో కాంగ్రెస్ నాయకులు కూడా ఏ మాత్రం తగ్గలేదు.
ఫరీద్‌కోట్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుశాల్‌దీప్ సింగ్ దిల్లాన్ కుటుంబం వద్ద రూ.1.21 కోట్ల విలువైన నగలు ఉన్నట్లు ఆయన తన అఫిడవిట్లో పేర్కొన్నారు.
అమృత్‌సర్ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ కుటుంబ సభ్యుల వద్ద రూ. కోటి విలువ చేసే నగలు ఉన్నాయట. అలాగే సిద్ధూ వద్ద రూ.44 లక్షల విలువైన వాచీలు కూడా ఉన్నాయి. సిద్ధూ ప్రత్యర్థి .. అకాలీదళ్ అభ్యర్థి బిక్రమ్ సింగ్ మజిథియా కుటుంబం వద్ద రూ.65.60 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నట్లు ఆయన అఫిడవిట్లో చూపించారు.
ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి ఓపీ సోనీ కుటుంబం వద్ద రూ.1.06 కోట్లు విలువైన నగలు ఉన్నాయట. లెహ్రాగాగా నుంచి పోటీ చేస్తున్న మరో కాంగ్రెస్ నేత బీబీ రాజిందర్ కౌర్ భట్టల్ వద్ద 22.50 లక్షల బంగారం ఉందట.
రాంపురఫుల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి గుర్‌ప్రీత్ సింగ్ కంగర్ కుటుంబం వద్ద కూడా రూ.75.17 లక్షలు నగలు , ఇదే స్థానం నుంచి పోటీ చేస్తున్న అకాలీదళ్ అభ్యర్థి సికిందర్ సింగ్ మలుకా కుటుంబం వద్ద రూ.27 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉన్నాయని ఈసీకి సమర్పించిన పత్రాల్లో పేర్కొన్నారు.
బటిండా నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మన్ ప్రీత్ సింగ్ బాదల్ కుటుంబం వద్ద రూ.31.20 లక్షలు విలువైన బంగారం ఉందంట.
రెండు ఖాతాల్లో రూ.24,409 మాత్రమే..
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో ఎక్కువ బంగారం ఉన్న అభ్యర్థిగా గుర్తింపు పొందిన సంగ్రూర్ నియోజకవర్గం నుంచి అరవింద్ ఖన్నాకు ఆప్ ప్రత్యర్థిగా బరిలోకి దిగుతున్న నరీందర్ కౌర్ భరాజ్‌కు ఇల్లు, పొలంతో ఎలాంటి వాణిజ్యపరమైన ఆస్తి లేకపోవడం గమనార్హం. ఆయనకు రెండు బ్యాంకు ఖాతాలు ఉండగా.. అందులో రూ.24,409 మాత్రమే నగదు ఉండటం విశేషం.