Punjab Election 2022: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. మొత్తం 86 సీట్లకు అభ్యర్థుల పేర్లు వెల్లడించింది. ఛామ్కౌర్ సాహిబ్ ఎస్సీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీ, అమృతసర్ ఈస్ట్ నుంచి పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ ఎన్నికల బరిలో దిగనున్నారు.
![Punjab Election 2022](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14194020_punjab-2.png)
![Punjab Election 2022](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14194020_punjab-1.png)
![Punjab Election 2022](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14194020_election.png)
Sonusood sister Congress ticket
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటుడు సోనూసోద్ సోదరి మాళవికా సూద్‌కు కూడా కాంగ్రెస్ టికెట్ ఖరారు చేసింది. మోగ నియోజకవర్గం అభ్యర్థిగా ఆమెను ఎన్నికల బరిలో నిలిపింది. క్వాడియన్ నియోజకవర్గానికి రాజ్యసభ సభ్యుడు ప్రతాప్ సింగ్ బాజ్వాను, సింగర్ సిద్ధూ మూసేవాలాను మన్సా నియోజవర్గానికి అభ్యర్థులుగా ఖరారు చేసింది.
డిప్యూటీ సీఎంలు సుఖజీందర్ సింగ్ రంధవా, ఓం ప్రకాశ్ సోనీని ప్రస్తుతం వారి ప్రాతినిధ్యం వహిస్తున్న డేరా బాబా నానక్, అమృత్సర్ సెంట్రల్ నియోజకవర్గాల నుంచి మరోసారి పోటీకి దింపుతోంది.
వారసులు..
పటియాలా రూరల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ మంత్రి బ్రహ్మ్ మహీంద్రా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఆ స్థానంలో ఆయన కుమారుడు మోహిత్ మహీంద్రా బరిలోకి దిగనున్నారు. మరోవైపు పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రచార కమిటీ చీఫ్ సునీల్ జఖర్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఆయనకు బదులుగా అబోహర్ నియోజకవర్గం నుంచి సునీల్ బంధువు సందీప్ జఖర్ పోటీ చేయనున్నారు.
ప్రస్తుతం మంత్రులుగా ఉన్న కీలక నేతలు మన్‌ప్రీత్ సింగ్ బాదల్ (బఠిండా అర్బన్ నియోజకవర్గం), విజయ్ ఇందర్ సింగ్లా (సంగ్రూర్), రజియా సుల్తానా (మాలేర్కొట్లా), గుర్కిరాత్ సింగ్ కొట్లీ (ఖన్నా), రానా గుర్జిత్ సింగ్ (కపుర్తలా), త్రిప్ట్ రాజీందర్ బాజ్వా (ఫతేగఢ్ చురియన్), రణ్‌దీప్ సింగ్ నభా (అమ్లోహ్), అమరీందర్ సింగ్ రాజా (గిద్దర్బాహ), పార్గత్ సింగ్ (జలంధర్ కంట్) నుంచి పోటీ చేయనున్నారు.
ఈ జాబితాను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం నిర్వహించిన సమావేశంలో ఖరారు చేసినట్లు కాంగ్రెస్ వెల్లడించింది.
పంజాబ్ శాసనసభకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10న వెలువడతాయి.
ఇదీ చూడండి : సొంత ఇలాఖా నుంచే యోగి పోటీ- అఖిలేశ్ సెటైర్