పంజాబ్‌లోని లూథియానా వీధుల్లో సాక్స్‌లు అమ్ముకునే ఓ బాలుడికి అండగా నిలిచాడు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్. ఆ బాలుడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. అంతేకాకుండా.. ఆ పిల్లవాడు చదువుకునేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు.
నిజాయతీగా నిరాకరణ..
లూథియానాకు చెందిన వన్ష్ సింగ్(10).. సాక్స్‌ల వ్యాపారం చేస్తుంటాడు. అతడి తండ్రి కూడా అదే పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తల్లి గృహిణి. వన్ష్ సింగ్‌తో పాటు మరో నలుగురు పిల్లలు కలిగిన ఆ కుటుంబం.. ఓ అద్దె ఇంట్లో నివాసముంటోంది. ఓ కస్టమర్.. వన్ష్ సింగ్ వద్ద సాక్స్‌లు కొని రూ.150 ఇవ్వగా.. దాని విలువ రూ.100 అని చెబుతూ.. మిగిలిన యాభై రూపాయల్ని తిరిగిచ్చేసి తనలో నిజాయతీ చాటుకున్నాడు.
ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా.. రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్‌కు తెలిసింది. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి.. ఆ పిల్లాడి విద్యకయ్యే ఖర్చులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. వన్ష్ సింగ్.. మళ్లీ పాఠశాలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్థానిక డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరులో విడివిడిగా.. కలివిడిగా!