జలియన్ వాలాబాగ్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాళులు అర్పించారు. 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జలియన్ వాలాబాగ్ మెమోరియల్ పార్కును ప్రారంభించి.. ప్రజలకు అంకితం చేశారు. మెుదటి స్మారక చిహ్నం అమరవీరులను గుర్తుంచుకోవడానికి ప్రస్తుతం ప్రారంభించిన రెండో చిహ్నం.. వారికి నివాళి అని ఆయన తెలిపారు.
అన్ని గ్రామాల మట్టి సేకరించి..
పంజాబ్‌లో అన్ని గ్రామాల నుంచి మట్టిని తీసుకువచ్చి మూడున్నర కోట్లతో ఒకటిన్నర ఎకరాల్లో మెమోరియల్ పార్క్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. నాటి మారణహోమంలో 448 మంది చనిపోయారని అధికారికంగా చెప్పినప్పటికీ.. ఎంతమంది చనిపోయారో కచ్చితమైన లెక్కలు లేవన్నారు. నిజమైన మరణాల లెక్కల కోసం ప్రత్యేక బృందం పరిశోధనలు జరుపుతోందని.. వారి పేర్లను లిఖించేందుకు స్మృతివనంలో తగిన స్థలాన్ని ఉంచినట్లు స్పష్టంచేశారు.
ఈ ఏడాది జనవరి 25న స్మృతివనానికి శంకుస్థాపన చేసి.. చెప్పిన ప్రకారం ఆగస్టు 15 వరకు పూర్తి చేశామని గుర్తు చేశారు. అనంతరం 29 మంది అమరవీరుల కుటుంబాలతో అమరీందర్‌సింగ్ ఫొటో దిగారు.
ఇదీ చూడండి: విదేశీ జంటను భారత రాజ్యాంగం కలిపిందిలా!