దివ్యాంగులు తమ పని చేసుకోవడానికే ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అయితే అటువంటి వారే మహారాష్ట్ర పుణెలోని ఓ రెస్టారెంట్లో సిబ్బందిగా పని చేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో అనుకుంటే పొరపాటే. అందులో పని చేసి సిబ్బంది దాదాపు అందరూ దివ్యాంగులే. వారికి భాషతో పనిలేదు. శరీర హావభావాలే వారి భాష. సైగల సాయంతోనే వినియోగదారులు చేసిన ఆర్డర్ మేరకు సర్వీసు చేస్తున్నారు.
![Pune Restaurant employs specially-abled persons to serve customers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11149773_restaurent.png)
ప్రత్యేక మెనూ కార్డు
ఆ రెస్టారెంట్లో మెనూ కార్డు ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కో ఆహార పదార్థానికి ఒక్కో సంజ్ఞ ఉంటుంది. ఆ సంకేతాల ద్వారా వారికి ఏం కావాలో ఆర్డర్ చేసుకోవచ్చు. "వినియోగదారుల సౌకర్యం కోసం సైగలతో కూడిన మెనూ కార్డును రూపొందించాం. వారికి కావాల్సిన ఆహారాన్ని ఆ సైగ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. దీంతో ఇరువురి మధ్య సంభాషణ చాలా సులభమవుతుంది" అని రెస్టారెంట్ యజమాని సోనాం కాప్సే తెలిపారు.
"ఈ రెస్టారెంట్లో 20 మంది వినికిడి శక్తి లేని, మాటలు రానివారు పని చేస్తున్నారు. అటువంటి వారినే నియమించుకుంటాం. వారు స్వతహాగా సంపాదించుకోవడానికి ఈ వేదిక తోడ్పడుతుంది. అందరూ సమానమనే భావన వారిలో కలిగించడమే మా లక్ష్యం. సాధారణంగా ఇటువంటి వారికి తెర వెనుక ఉండే ఉద్యోగాలనే ఇస్తారు. కిచెన్లో పని చేయడానికే నియమించుకుంటారు. అందుకే సామాజిక దృక్పథంతో ఓ అడుగు ముందుకేశాం."
- సోనాం కాప్సే, రెస్టారెంట్ యజమాని
"ఇక్కడి వాతావరణం చాలా బాగుంది. సంజ్ఞ విధానంలో తెలియజేసే అనుభూతి కొత్తగా ఉంది. ఇటువంటిది ముంబయిలో ఇప్పటికే ఉంది. అయితే పుణెలో ఇదే తొలిసారి. ఆహారం కూడా రుచికరంగా ఉంది. ఇలాంటి వాటిని తప్పనిసరిగా ప్రొత్సహించాలి" అని ఓ వినియోగదారుడు చెప్పుకొచ్చాడు.
ఇదీ చూడండి: 'ఆర్గానిక్ కిచెన్ గార్డెన్' అమలులో ఆ పాఠశాల భేష్