భారత 75 స్వాతంత్య్ర దినోత్సవం.. అలనాటి దేశ స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1947 నుంచి సాధించిన విజయాలను ప్రపంచాలనికి తెలియజేసేలా వేడుకలు ఉండాలని సూచించారు.
2022 ఆగస్టు 15న నిర్వహించబోయే 75వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం 259 మందితో ఏర్పాటైన ఉన్నత స్థాయి ప్యానల్‌తో తొలిసారి వర్చువల్‌గా సమావేశమయ్యారు ప్రధాని.
"దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు ఎలా ఉండాలంటే.. స్వాతంత్య్ర సంగ్రామం మూల సూత్రం, సమరయోధుల త్యాగాలు సాక్షాత్కరించాలి. ఈ వేడుకల్లో అమరవీరులకు శ్రద్ధాంజలి ఉండాలి. భారత్ ఎలా అభివృద్ధి చెందాలని వారు కోరుకున్నారో.. ఆ సంకల్పం కూడా కనిపించాలి. భారత సనాతన ధర్మాలు, ఆధునిక భారతావని మెరుపులు కూడా కనిపించాలి. ఈ వేడుక ద్వారా 75ఏళ్లలో మనం సాధించిన విజయాలను ప్రపంచానికి వివరించడంతోపాటు వచ్చే 25ఏళ్లకు ఒక రూపం, సంకల్పాన్ని ఇవ్వాలి. 2047లో మనం స్వాతంత్య్ర శతాబ్ధి ఉత్సవాలు జరుపుకుంటాం. అప్పుడు మనం ఎక్కడున్నాం, ప్రపంచంలో మనం స్థానం ఏంటి, భారత్‌ను ఏ స్థాయికి తీసుకెళ్లగలమనేది వివరించాలి.
75వ స్వాతంత్య్ర వేడుకలు, స్వాతంత్య్ర సంగ్రామం మనకు ప్రేరణను కలిగిస్తాయి. ఈ అంశాలపై ఒక పీఠిక తయారుచేస్తాం. ఆ పీఠిక ఆధారంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు శతాబ్ది ఉత్సవాల దిశగా సమర్థంగా ముందుకు సాగేందుకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈ ఉత్సవాలకు ప్రజల భాగస్వామే ముఖ్యమైన అంశం. 75వ స్వాతంత్య్ర వేడుకలకు సంబంధించి మనకు వచ్చే సూచనలు, సలహాలను సమ్మిళితం చేస్తాం. వాటిని ఐదు అంశాలుగా విభజిస్తాం. స్వాతంత్య్ర పోరాటం, 75ఏళ్ల వేడుకనాటికి ఆలోచనలు, విజయాలు, కార్యకలాపాలు, సంకల్పాలు..ఈ ఐదు అంశాలను తీసుకొని మనం ముందుకెళ్లాలి. "
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
ప్రధాని అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీలో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, 28 మంది ముఖ్యమంత్రులు, లతా మంగేష్కర్, ఏఆర్ రెహమాన్ అంటి కళాకారులు, అలాగే.. విపక్ష నేతలు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఎన్సీపీ నేత శరద్ పవార్, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వంటి కీలక నేతలు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు చంద్రశేఖర్‌రావు, జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సహా మరికొంత మంది కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఇదీ చూడండి: ఎన్నికలకు ముందే బడ్జెట్ సమావేశాలు ముగింపు!