యువతుల పాలిట కీచకుడిగా మారిన మాజీ ఉపాధ్యాయుడు ఉమేశ్‌రెడ్డికి(Umesh Reddy News) ఉరి శిక్ష ఖరారు చేస్తూ కర్ణాటక హైకోర్టు(Karnataka HC News) బుధవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లేందుకు హైకోర్టు ధర్మాసనం ఆరు వారాల సమయం ఇచ్చింది. చిత్రదుర్గకు చెందిన ఉమేశ్‌రెడ్డి(Umesh Reddy News) రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 19 మందిపై అత్యాచారానికి పాల్పడి.. అందులో అత్యధికులను హతమార్చినట్లు కోర్టు విచారణలో తేలింది. బెంగళూరు నగర పరిధి పీణ్యలో 1998లో ఓ మహిళపై హత్యాచారానికి పాల్పడిన కేసులో.. సెషన్స్ న్యాయస్థానం 2006లో ఉరి శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఉరి శిక్షను రద్దు చేయాలంటూ నిందితుడి విన్నపాన్ని 2013లో రాష్ట్రపతి తిరస్కరించారు.
సర్వోన్నత న్యాయస్థానంలోనూ అర్జీని తిరస్కరించడంతో.. ఉరి శిక్షను జీవితఖైదుగా మార్చాలని మరోసారి అప్పీలు చేసుకున్నాడు. హైకోర్టులోనే అర్జీ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సెషన్స్ న్యాయస్థానం తీర్పును హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అరవింద కుమార్, జస్టిస్ ప్రదీప్ సింగ్ యెరూర్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించి ఉరి శిక్షను ఖరారు చేసింది.
19 మందిని కడతేర్చాడనేది అభియోగం. ఓ మహిళపై అత్యాచారం చేసి ఆమెను చంపాలని ప్రయత్నిస్తుండగా బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉమేశ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పుడే పరారైన ఆయన్ను పోలీసులు వలపన్ని 2002లో యశ్వంతపురలో పట్టుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి ఆధారాలు సేకరించారు. అతనిపై 11 కేసుల్లో విచారణ పూర్తయి శిక్షలు పడగా.. మరో 8 కేసుల్లో తీర్పులు వెలువడాల్సి ఉంది.
ఇదీ చదవండి:డ్రగ్స్ దందాలో 'సింగం' నటుడు అరెస్టు