నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నాలుగు నెలలకు పైగా దిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్నారు రైతులు. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ఇవాళ ఉదయం 8 గంటల నుంచి 24 గంటల పాటు కుండ్లీ-మనేసర్-పల్వాల్(కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వేను, మరో హైవేను దిగ్భందించనున్నారు. సాగు చట్టాలు రద్దయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
"శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్‌ప్రెస్‌వేను, కుండ్లీ-గాజియాబాద్- పల్వాల్ హై వేను దిగ్భందిస్తాం."
--సంయుక్త కిసాన్ మోర్చా.
జలియన్ వాలాబాగ్ హత్యాకాండ ఘటన జరిగిన ఏప్రిల్ 13, అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న దిల్లీ సరిహద్దుల్లో పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రైతు సంఘాలు పేర్కొన్నాయి.
కొవిడ్‌కు భయపడం..
దేశ రాజధాని దిల్లీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో.. వైరస్ ఉద్ధృతి దృష్ట్యా అన్నదాతల పోరాటం ఆగదని రైతు సంఘాలు స్పష్టం చేశాయి. కొవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో తగు జాగ్రత్తలు వహిస్తున్నట్లు తెలిపాయి. మాస్కులు ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా చేసుకోవడం వంటివి రైతులు చేస్తున్నారని పంజాబ్‌లోని ఆల్ ఇండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు లఖ్బీర్ సింగ్ తెలిపారు. అన్నదాతలను కొవిడ్ టీకా తీసుకోవాలని ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.
ఉద్యమ రైతుల్లో కరోనా లేదు!
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు నాలుగు నెలలకు పైగా ఆందోళన బాటపట్టిన రైతాంగంపై కరోనా ప్రభావంలేదని వైద్యులు వెల్లడించారు. రోగ నిరోధక శక్తితో రైతులు సురక్షితంగానే ఉన్నారని సింఘూ సరిహద్దులో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న డాక్టర్లు, ఎన్జీవోల ప్రతినిధులు పేర్కొన్నారు.
"ఇక్కడ కొంతమంది జలుబు, జ్వరం వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో అందరికీ సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించాం. నలుగురిలో కరోనా లక్షణాలు కనిపించడంతో కొవిడ్ పరీక్షలకు పంపాం. ఫలితాల్లో వారికి నెగిటివ్ వచ్చింది" అని బంగాల్‌కు చెందిన వైద్యుడు సాగర్ తెలిపారు. వైరస్ బారిన పడకుండా అర్హులైన రైతులు టీకా తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు.
"వాతావరణంలోని మార్పుల కారణంగా పలువురిలో దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించాయి. అంతకుమించి ఎటువంటి అత్యయిక పరిస్థితి ఇక్కడ లేదు" అని లైఫ్ కేర్ ఎన్‌జీవో వ్యవస్థాపకుడు అవతార్ సింగ్ పేర్కొన్నారు. గతేడాది నవంబర్ నుంచి తాము ఇక్కడే ఉంటున్నామని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయడం వంటి చర్యలు తీసుకోవడమే కాకుండా అనుమానం వచ్చిన రైతులను పరీక్షలకు పంపుతున్నామని వివరించారు. రైతుల్లో కొందరు తలనొప్పి, కడుపునొప్పి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని యునైటెడ్ సింగ్ ఆర్గనైజెషన్ వాలంటీర్ చరణ్‌జీత్ సింగ్ తెలిపారు.
ఇదీ చదవండి:ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా