గాంధీ జయంతి (Gandhi Jayanti) సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన కలలు కన్న భారతాన్ని నిజం చేసే దిశగా పౌరులందరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతి(అక్టోబర్ 2) సందర్భంగా మాట్లాడిన రాష్ట్రపతి.. గాంధీ జయంతి భారతీయులందరికీ ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించారు.
"గాంధీజీ చేసిన పోరాటాలు, త్యాగాన్ని గుర్తుంచుకోవడానికి ఇదొక మంచి సందర్భం. అదే వారి నుంచి ప్రేరణ పొంది దేశ శ్రేయస్సు, అభివృద్ధి కోసం పనిచేయడానికి మాకు స్ఫూర్తినిస్తుంది. ఆయన బోధనలు, ఆదర్శాలను మనం కూడా పాటించి, గాంధీజీ కలలు కన్న భారతావనిని నిర్మించేందుకు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేద్దాం."
- రామ్నాథ్ కోవింద్, రాష్ట్రపతి
గాంధీజీ అహింసా ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తిగా ప్రపంచం ఆయన్ను గుర్తు పెట్టుకుంటుందని రాష్ట్రపతి అన్నారు.
గాంధీజీ ఆలోచనలు ఇప్పటికీ నిత్యనూతనమే..
గాంధీజీ ఆలోచనలు ఆధునిక కాలానికీ సరిపోతాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అణగారిన వర్గాలను ముందుకు నడిపే స్ఫూర్తిమంత్రమే గాంధీ అని కొనియాడారు. గాంధీజీ ఆయుధాలైన సత్యం, అహింస అనేవి మానవాళి మీద చెరగని ముద్ర వేశాయని వెంకయ్యనాయుడు అన్నారు. గ్రామస్వరాజ్యంపై మహాత్ముడే మనందరికీ ప్రేరణ అని తెలిపారు.
సైకత నివాళి...
గాంధీ జయంతి సందర్భంగా సైకత శిల్పంతో ఆయనకు నివాళి అర్పించారు ప్రముఖ కళాకారుడు మానస్ కుమార్ సాహో. ఒడిశాలోని పూరి బీచ్లో సుమారు 7 గంటులు పాటు చెమటోడ్చి 15 టన్నుల ఇసుకతో 15 అడుగుల గాంధీజీ సైకత శిల్పాన్ని రూపొందించారు.
ఇదీ చూడండి: Lal Bahadur Shastri Jayanti: గోధుమలతో మాజీ ప్రధానికి నివాళి