బిహార్ ముఖ్యమంత్రి, జేడీ(యూ) నేత నీతీశ్ కుమార్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవల భాజపాతో పొత్తుకు ముగింపు పలికినా.. ఇంకా ఆ పార్టీతో బంధాన్ని కొనసాగిస్తున్నారని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలా అన్నిసార్లు రెండు మార్గాలు సాధ్యం కాదన్నారు. 'నీతీశ్ కుమార్‌జీ భాజపా/ఎన్డీఏతో మీకు ఎలాంటి సంబంధం లేకపోతే.. మీ ఎంపీని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని వీడమని చెప్పండి. మీకు అన్నివేళలా రెండు అవకాశాలు ఉండవు' అని తాజాగా పీకే ట్వీట్ చేశారు.
భాజపాతో నీతీశ్ టచ్‌లోనే ఉన్నారని.. పరిస్థితులు డిమాండ్ చేస్తే కాషాయ పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకుంటారని రెండురోజుల క్రితం పీకే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 'భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేసేందుకు నీతీశ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. కానీ, ఆయన భాజపాతో టచ్‌లో ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోతారు'. అని పీకే వ్యాఖ్యానించారు.
'ఆ పార్టీ ఎంపీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ సహాయంతో నీతీశ్ భాజపాతో టచ్‌లోనే ఉన్నారు. అందుకే భాజపాతో తెగతెంపులు చేసుకున్నప్పటికీ హరివంశ్‌ను రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ సభ్యత్వానికి రాజీనామా చేయమని కోరలేదు. ఆయన ద్వారా అవసరమైనప్పుడు భాజపాతో కలిసి పనిచేస్తారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి.' అని బిహార్‌లో పాదయాత్ర కొనసాగిస్తోన్న ప్రశాంత్ కిశోర్ విమర్శించారు.
అయితే ఈ వ్యాఖ్యలను నీతీశ్ ఖండించారు. "మీరు నాకో సాయం చేయండి. ఆయన గురించి నన్ను అడగకండి. ఆయన పబ్లిసిటీ కోసమే మాట్లాడుతుంటారు. ఆయన్ను మాట్లాడుకోనివ్వండి" అంటూ నిన్న నీతీశ్ స్పందించారు. అయితే, నీతీశ్ కుమార్ శుక్రవారం ఈ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ప్రశాంత్ కిశోర్ కేవలం పబ్లిసిటీ కోసమే ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. వయసులో చిన్నవాడు కదా.. ఏదైనా మాట్లాడతాడని అన్నారు. ‘దయచేసి అతని గురించి అడగొద్దు. సొంత పబ్లిసిటీ కోసం ఏదోకటి మాట్లాడుతూనే ఉంటాడు. అతను ఏం చెప్పాలనుకున్నా.. చెప్పొచ్చు. మేం పట్టించుకోం. ఒక సమయంలో నేను అతన్ని గౌరవించా. కానీ, ఇప్పుడు అతని మనసులో ఏముందో తెలియదు. అతను చిన్నవాడు. నేను గౌరవించిన వ్యక్తులు.. నాతో తప్పుగా ప్రవర్తించారని మీకందరికీ తెలుసు’ అని నీతీశ్ కుమార్ విలేకరులతో అన్నారు.
ఇదీ చదవండి: 'ఆ ఇద్దరు మాజీ మంత్రులు నన్ను లైంగికంగా వేధించారు'
వెంటిలేటర్ తీసేసి ఇంటికి వెళ్తానని పట్టుబట్టిన జయలలిత.. నివేదికలో విస్తుపోయే నిజాలు