ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఈ నెల 22న(సోమవారం) బంగాల్, అసోంలో పర్యటించనున్నారు. ఉదయం 11:30 గంటలకు అసోం దేమాజీ జిల్లాలోని శిలపతార్లో చమురు, గ్యాస్ ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇవ్వనున్నారు. ఇంజినీరింగ్ కళాశాలలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4:30 గంటలకు బంగాల్లోని హూగ్లీలో వివిధ రైల్వే ప్రాజెక్టులను మోదీ ప్రారంభించనున్నారు.
అసోంలో మోదీ..
దిబ్రుగఢ్‌లోని మధువన్ వద్ద ఇండియన్ ఆయిల్‌కు చెందిన ఇండ్మ్యాక్స్ యూనిట్‌ను ప్రధాని.. జాతికి అంకితం ఇవ్వనున్నారు. దేమాజీ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు, సువాల్‌కుచి ఇంజనీరింగ్ కళాశాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి, అసోం ముఖ్యమంత్రి, గవర్నర్ పాల్గొననున్నారు.
బంగాల్లో మోదీ..
బంగాల్లో నోపారా నుంచి దక్షిణేశ్వర్ వరకు విస్తరించిన మెట్రో రైల్వేను జెండా ఊపి ప్రధాని ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన రూ.464 కోట్లతో 4.1 కి.మీ మేర ఈ ప్రాజెక్టును విస్తరించారు. సౌత్ ఈస్టర్న్ రైల్వేకు చెందిన కలైకుండ-ఝార్గ్రామ్ మధ్య మూడో రైల్వేను ప్రధాని ప్రారంభించనున్నారు. రూ.1,312 కోట్లతో ఈ రైల్వే లైన్‌ను నిర్మించారు. దాంతోపాటుగా వివిధ రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను ఆయన ప్రారంభించి, జాతికి అంకితమివ్వనున్నారు.