సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తున్న సిక్కు రైతులను దూషించడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. అలా చేయడం వల్ల దేశానికి ఒరిగేదేం లేదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మాట్లాడిన మోదీ.. ప్రతి ఒక్క సిక్కును చూసి దేశం గర్విస్తోందని అన్నారు.
"సిక్కులు చేసిన సేవకు భారత్ గర్విస్తోంది. దేశానికి ఎంతో చేసిన సమాజం అది. వారిని తప్పుదోవ పట్టించేందుకు కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు, ఉపయోగిస్తున్న భాష దేశానికి ఎన్నటికీ మేలు చేయవు. పంజాబ్‌లో ఇదివరకు ఏం జరిగిందో మనం మర్చిపోకూడదు. విభజన సమయంలో ఈ ప్రాంతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. 1984 అల్లర్ల సమయంలో కన్నీరు చిందించింది. అత్యంత బాధాకరమైన ఘటనలకు బాధిత రాష్ట్రంగా మిగిలింది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
రెండు నెలలకు పైగా సాగుతున్న నిరసనలను ఆపేయాలని రైతులను కోరారు మోదీ. వ్యవసాయ చట్టాలను అమలు చేసేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. సాగు చట్టాలపై రాజకీయం చేయడాన్ని ఖండించారు. రైతులతో వ్యవసాయ మంత్రి చర్చలు జరుపుతున్నారని, ఒకరి ప్రతిపాదనలు మరొకరు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఇకపైనా చర్చలు జరిపేందుకు కేంద్రం సిద్ధంగానే ఉందని స్పష్టం చేశారు.
"సాగు చట్టాలపై నిరసన చేస్తున్న రైతులకు ఆ సంస్కరణలు అర్థమయ్యేలా చేసి సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నా. నిరసన తెలపడం హక్కు అయినప్పటికీ.. వృద్ధులు సైతం ఆ విధంగా పాల్గొనడం సరికాదు. వారంతా వెనక్కి వెళ్లాలి. ఆందోళనకు ముగింపు పలకాలి. అందరం కలిసి పరిష్కారాన్ని కనుగొనాలి. చర్చలకు అన్ని తలుపులు తెరిచే ఉన్నాయి. ఈ సభా వేదికగా వారిని మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నా."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఎంఎస్పీ ఉంటుంది
సాగుచట్టాల వల్ల కనీస మద్దతు ధర/మండీ వ్యవస్థ రద్దు అవుతుందన్న ఆరోపణలను మోదీ ఖండించారు. కనీస మద్దతు ధర ఎప్పటికీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశంలో మూడింట రెండొంతుల మంది రైతులకు చిన్న కమతాలే ఉన్నాయని, సాగు చట్టాల వల్ల వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు.
"మండీలను ఆధునికీకరిస్తామని హామీ ఇస్తున్నా. ఇదొక్కటే కాదు. ఎంఎస్పీ ఇదివరకు ఉంది, ఇప్పుడూ ఉంది, ఇకపైనా ఉంటుంది. 80 కోట్ల మంది ప్రజలకు ఇస్తున్న చౌక రేషన్ కొనసాగుతుంది. రైతుల ఆదాయాలను పెంచే మార్గాలను బలోపేతం చేయాలి. దయచేసి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
వ్యవసాయ రంగంలో కొన్ని సమస్యలు ఉన్నాయని, అందరూ కలిసే వాటికి పరిష్కారం కనుగొనాలని మోదీ సూచించారు. పంట ఉత్పత్తులను అమ్మకునేందుకు రైతులకు ఉన్న అడ్డంకులపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. '1930లో ప్రవేశపెట్టిన మార్కెటింగ్ పాలన వల్ల రైతులు తమ ఉత్పత్తులను అధిక ధరకు విక్రయించలేకపోతున్నారని, ఈ అడ్డంకులను తొలగించడమే తమ లక్ష్యమని మన్మోహన్ చెప్పార'ని మోదీ స్పష్టం చేశారు.
ఎఫ్‌డీఐ- విదేశీ విధ్వంసక భావజాలం
ఎఫ్‌డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కి కొత్త అర్థం చెబుతూ దేశ ప్రజలను అప్రమత్తం చేశారు మోదీ. దేశంలో కొత్త ఎఫ్‌డీఐ ఆవిర్భవించిందని.. అదే 'విదేశీ విధ్వంసక భావజాలమ'ని అన్నారు. అలాంటి భావజాలం నుంచి దేశాన్ని కాపాడేందుకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రొఫెషనల్ నిరసనకారులు పుట్టుకొస్తున్నారని, ప్రతి ఆందోళనల్లో వారు కనిపిస్తున్నారని అన్నారు.
కరోనా కట్టడిలో భేష్
కరోనా కట్టడిపై వ్యక్తమైన అనుమానాలను భారత్ తప్పని నిరూపించిందని అన్నారు మోదీ. కోట్లాది మందికి కరోనా సోకి, లక్షల మంది మరణిస్తారని అంచనాలు వేశారని విపక్షాలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మానవాళిని కాపాడినందుకు ఇప్పుడు ప్రపంచమే భారత్‌ను ప్రశంసిస్తోందని చెప్పారు.
కరోనాపై పోరులో అనేక దేశాలకు భారత్ అండగా నిలిచిందని గుర్తు చేశారు మోదీ. ఇతర దేశాలకు టీకాను అందించినట్లు తెలిపారు. 150కి పైగా దేశాలకు ఔషధాలను సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ గొప్పతనం ఏ ప్రభుత్వానికో, వ్యక్తులకో చెందదని.. భారత్ మొత్తానికీ సొంతమని అన్నారు. అతి తక్కువ సమయంలో టీకా అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలను కొనియాడారు.
ఎఫ్‌డీఐల వెల్లువ
దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని అన్నారు మోదీ. కరోనా సమయంలోనూ దేశానికి రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు లభించాయని చెప్పారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. భారత్ నుంచి ప్రపంచ దేశాలు రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోందని.. ప్రపంచదేశాల మెరుగుదలకు భారత్ తప్పక సహకరిస్తుందని విశ్వసిస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి: ప్రపంచమంతా భారత్‌వైపే చూస్తోంది: మోదీ