లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైంది కర్ణాటకలోని వివేకానంద్ కుటుంబం. కాళీగా కూర్చోవడం ఎందుకు అనుకున్నారు. మాస్క్‌లు లేక ఇబ్బంది పడుతున్న వారికి సాయం అందించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా వేలాది మాస్క్‌లను తయారు చేసి.. చుట్టుపక్కలవారికి వాటిని అందజేశారు. ప్రధాని మోదీకి సైతం ఆ మాస్క్‌లను పంపగా.. అభినందిస్తూ పీఎంవో నుంచి వచ్చిన లేఖ ఆ కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచింది.
పంచడానికి ఎనిమిది వేల మాస్క్‌లు...
వివేకానంద్ స్వతహాగా సామాజిక కార్యకర్త. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లో ఆర్థికంగా వెనకబడిన వారి కోసం మాస్క్‌లు తయారు చేసి పంచాలని అనుకున్నారు. అందుకోసం సుమారు ఎనిమిది వేలకు పైగా మాస్క్‌లను సిద్ధం చేశారు. అందులో దేశభక్తి ప్రతిబింబించేలా త్రివర్ణ పతాకం రంగుల్లో వాటిని రూపొందిచారు. పట్టణంలో డబ్బుపెట్టి కొనలేని వారిని గుర్తించి వారికి అందించారు.
ప్రధానికో పార్సిల్...
తండ్రి చేసిన మంచి పనిని ఆదర్శంగా తీసుకున్న కుమార్తెలకు ఓ ఐడియా వచ్చింది. ప్రధానికి మాస్క్‌ల సెట్టును పంపాలి అనుకున్నారు. దాచుకున్న డబ్బుతో దిల్లీలోని ప్రధాని కార్యాలయానికి రిజిస్టర్ పోస్ట్ చేశారు. ఎన్నో రోజులు చూసినా సమాధానం రాలేదు. బహుశా ఆ పోస్ట్ చేరలేదేమో అనుకున్నారు. ఒకరోజు మోదీ ధరించిన మాస్క్‌ను చూశారు. అది తాము పంపిందే అని నిర్ధరించుకున్నారు. ఇంతలో పీఎంవో నుంచి ధన్యవాదాలు చెబుతూ వచ్చిన లెటర్ చూసి ఆనందం రెండింతలైంది.
లాక్డౌన్ సమయంలో మాస్క్‌లను తయారు చేశాం. ధరించడానికి సులభంగా ఉండేలా.. నాణ్యతతో రూపొందించాం. వాటిలో కొన్నింటిని ప్రధాని మోదీకి నా కుమార్తెలు కావ్య, నమ్రతా పంపారు. మేము పంపిన వాటికి సమాధానంగా అభినందన పత్రం రావడం చాలా సంతోషంగా ఉంది.
-వివేకానంద్
మేము మొదటగా పార్సిల్ పంపాం. ఎటువంటి సమాధానం లేదు. కొన్ని రోజుల తరువాత ప్రధాని మేము పంపిన మాస్క్‌లు వేసుకుని ఉండడం చూసి చాలా అనందపడ్డాం. మాకు పీఎంవో నుంచి అభినందన పత్రం కూడా అందింది. మా ఆనందానికి ఆవధులు లేవు.
- కావ్య, నమ్రతా
ఇదీ చూడండి: కార్మికులకు దొరికిన వజ్రాలు- వాటి ఖరీదు ఎంతంటే?