గత ప్రభుత్వాలు సొంత కుటుంబాల ఖజానాలు నింపుకుని ఆదాయాన్ని పెంచుకునేందుకు తహతహలాడాయని, తమ ప్రభుత్వం మాత్రం పేదల డబ్బును పొదుపు చేసి, వసతులు కల్పించే దిశగా అడుగులు వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధార్థ్నగర్లో 9 వైద్య కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభించిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"9 కళాశాలలను ఒకేసారి ప్రారంభిచడం ఎప్పుడైనా జరిగిందా? గతంలోని ప్రభుత్వాలు సొంత లాకర్లు నింపుకునేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు పనిచేశాయి. మా ప్రభుత్వం మాత్రం పేదల కోసం పనిచేస్తోంది. పేదల డబ్బులు పొదుపు చేసి వారికి మంచి వసతులు అందించడానికి పాటుపడుతోంది. గత ప్రభుత్వాలు పూర్వాంచల్(ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రాంతం)ను నాశనం చేశాయి. మా ప్రభుత్వం ఇప్పుడు అక్కడి ప్రజల జీవితాల్లో ఆశలు నింపుతోంది. యూపీలోని వైద్యవ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అనేది పార్లమెంట్ వేదికగా యోగి ఆదిత్యనాథ్ బయటపెట్టారు. ఆయన కృషిని ప్రజలు మర్చిపోలేరు. ఈ 9 కళాశాలల వల్ల 2500 పడకలు అందుబాటులోకి వచ్చాయి. 5వేల మందికి ఉపాధి లభించింది. పూర్వాంచల్‌ను గత ప్రభుత్వాలు వ్యాధుల పుట్టగా మార్చేశాయి. కానీ ఇప్పుడు కథ మారుతుంది. ఉత్తర భారతానికే మెడికల్ హాబ్‌గా పూర్వాంచల్‌ను తీర్చిదుద్దుతాము."
--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
రూ. 2.3వేల కోట్లతో..
సిద్ధార్థ్‌నగర్, ఈటాహ్, హర్దోయ్, ప్రతాప్‌గఢ్, ఫతేపుర్, దేవరియా, మీర్జాపుర్, జౌన్‌పుర్ జిల్లాలో రూ. 2,329కోట్ల వ్యయంతో ఈ 9 కళాశాలలను నిర్మించారు. ఆరోగ్య నిపుణులు, వైద్యకళాశాల పెంపు, జిల్లా ఆసుపత్రుల్లోని మౌలికవసతులను సమర్థవంతంగా ఉపయోగించేందుకు చేపట్టిన కేంద్ర పథకం ద్వారా 8 కళాశాలను ఏర్పాటు చేశారు. జౌన్‌పుర్‌లోని వైద్య కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో నిర్మించుకుంది.
ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాడవియా పాల్గొన్నారు.
ఏకకాలంలో 9 వైద్య కళాశాలలు ప్రారంభించడం చిన్న విషయం కాదని, వర్ధమాన, భవిష్యత్తు తరాలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని మాండవియా అభిప్రాయపడ్డారు.
ఈ వేడుకకు బహిరంగ సభ ఏర్పాటు చేయగా.. మోదిని చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు.
ఇదీ చూడండి:- ఈనెల 29న ఇటలీకి మోదీ- జీ20 సదస్సుకు హాజరు