ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ దాస్ మోదీ ఆస్పత్రిలో చేరారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా తమిళనాడు చేరుకున్న మోదీ సోదరుడు ప్రహ్లాద్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అక్కడ సిబ్బంది ఆయనను అత్యవసరంగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. మోదీ సోదరుడు ప్రహ్లాద్ దామోదర్ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా కన్యాకుమారి, మధురైతో పాటుగా మరి కొన్ని ప్రాంతాల సందర్శనకు వచ్చారు. అయితే చెన్నై చేరుకున్న ఆయన అనారోగ్యంతో మంగళవారం అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే ప్రహ్లాద్ కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం మోదీ సోదరుడి ఆరోగ్యం నిలకడగా ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు వెల్లడించారు.
కారు ప్రమాదం నుంచి కోలుకుని..
ప్రహ్లాద్ ప్రస్తుతం గుజరాత్ అహ్మదాబాద్‌లో ఓ టైర్ షోరూమ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రహ్లాద్ మోదీ ఇటీవలే కర్ణాటకలోని మైసూర్లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో మోదీ సోదరుడితో పాటు ఆయన కుటుంబ సభ్యులు గాయపడ్డారు. గతేడాది డిసెంబర్ 27న మోదీ తమ్ముడు ప్రహ్లాద్ దామోదర్ దాస్‌తో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు.. బెంజ్ కారులో బయలుదేరారు. మైసూరు నుంచి బందీపుర్ వైపు వెళ్తుండగా కడకోల సమీపంలో రోడ్డు డివైడర్‌ను కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. కొద్దిరోజుల క్రితమే ఆయన ఈ ప్రమాదం నుంచి కోలుకుని ఆధ్యాత్మిక యాత్ర చేపట్టారు. దానిలో భాగంగానే తమిళనాడు చేరుకున్నారు.
ఇటీవలే మృతి చెందిన మోదీ తల్లి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ గతేడాది డిసెంబర్ 30న కన్నుమూశారు. అంతకుముందు ఆమె ఆరోగ్య విషమించడం వల్ల అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో చేర్పించారు. దీంతో మోదీ హుటాహుటిన దిల్లీ నుంచి గుజరాత్‌కు చేరుకుని.. గంటకు పైగా ఆస్పత్రిలో తల్లితోనే ఉన్నారు. ఆస్పత్రిలోని వైద్యులతో తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. డిసెంబర్ 29న తన తల్లి ఆరోగ్యం మెరుగుపడిందని మోదీ సోదరుడు సోమాభాయ్ తెలిపారు. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె డిసెంబర్ 30న మృతి చెందారు. సమాచారం అందుకున్న మోదీ వెంటనే గుజరాత్ చేరుకుని తన తల్లి హీరాబెన్ అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆమెకు నివాళులు తెలిపిన తర్వాత తల్లి హీరాబెన్ పాడె మోశారు. గాంధీనగర్‌లోని సెక్టార్ 30లో హీరాబెన్ అంత్యక్రియలు అదే రోజు పూర్తయ్యాయి.