గుజరాత్ మోర్బీలో బ్రిడ్జి కుప్పకూలిన ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఈ దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. వంతెన కుప్పకూలిన ఘటనలో క్షతగాత్రులను సోమవారం పరామర్శించారు మోదీ. మోర్బీ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. ఆరుగురు బాధితులతో మాట్లాడారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆసుపత్రిలో గడిపారు ప్రధాని. ఆసుపత్రిలో గాయపడ్డవారికి అందుతున్న చికిత్స గురించి ఆరా తీసిన మోదీ.. మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
అనంతరం, మోర్బీ ఎస్పీ కార్యాలయంలో మృతుల కుటుంబాలను కలిశారు మోదీ. ఆ తర్వాత సీనియర్ అధికారులతో కలిసి అత్యున్నత సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం చేయాలని అధికారులకు సూచించారు. ఘటనపై విస్తృతమైన దర్యాప్తు జరగాలని, అన్ని కోణాల్లో ఘటనపై విచారణ చేపట్టాలని మోదీ స్పష్టం చేశారు.
సహాయక సిబ్బందితో
అంతకుముందు, ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లారు మోదీ. ప్రమాదానికి కారణాలు, చేపట్టిన సహాయక చర్యలపై అధికారులు.. మోదీకి వివరాలు వెల్లడించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది, అధికారులతో ప్రధాని మాట్లాడారు.
ఆదివారం మోర్బీలో ఘోర దుర్ఘటన జరిగింది. కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అనేక మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. 170 మందిని సురక్షితంగా కాపాడినట్లు గుజరాత్ మంత్రి రాజేంద్ర త్రివేది వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మోదీ.. ఆస్పత్రిని సందర్శించారు. ఆయన పర్యటన సోమవారమే ఖరారైంది. దీంతో ఆస్పత్రికి మెరుగులు దిద్దే కార్యక్రమాన్ని ఆఘమేఘాల మీద చేపట్టారు. ప్రధాని రాకకు ముందు మోర్బీ ఆసుపత్రిలో మరమ్మతు పనులు చేస్తున్న దృశ్యాలను విపక్ష పార్టీలు షేర్ చేశాయి. 'అంతమంది ప్రజలు చనిపోతే.. భాజపా కార్యకర్తలు మాత్రం ఫొటోషూట్ కోసం ఆసుపత్రిని సిద్ధం చేస్తున్నారు. వారికి సిగ్గుగా అనిపించడం లేదా? భాజపాకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ మాత్రమే తెలుసు. ఈ అలంకరణకు బదులుగా బాధితులకు తగిన చికిత్స అందేలా చూడాలి' అని విపక్ష పార్టీలు మండిపడ్డాయి.