భారత ఆటబొమ్మల ప్రదర్శన-2021(ది ఇండియా టాయ్ ఫెయిర్)ని దిల్లీలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటనలో తెలిపింది. బొమ్మల పరిశ్రమ సమగ్రాభివృద్ధి దిశగా.. వర్తకులు, వినియోగదారులు, ఉపాధ్యాయులు, డిజైనర్లను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు పేర్కొంది.
"పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా బొమ్మల తయారీ రంగంలో భారత్‌ను ఎలా ప్రపంచ కేంద్రంగా మార్చవచ్చో.. పరిశ్రమలు, ప్రభుత్వం ఈ వేదిక ద్వారా చర్చించవచ్చు. మార్చి 2తో ఈ ప్రదర్శన ముగుస్తుంది. 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1000 మందికి పైగా తమ ఉత్పత్తులను ఇందులో ప్రదర్శిస్తారు."
-ప్రధాన మంత్రి కార్యాలయం
'టాయ్ ఫెయిర్'లో భారతీయ సంప్రదాయ బొమ్మలతో పాటు, ఆధునిక ఆటబొమ్మలు, విద్యుత్ బొమ్మలు, పజిల్స్, ఇతర ఆట బొమ్మలు కనువిందు చేయనున్నాయి. బొమ్మల తయారీ రంగంపై ప్రముఖ భారతీయ, అంతర్జాతీయ వక్తలు.. వెబినార్లలో ప్రసంగించనున్నారు.