వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవలంబించడం తక్షణావసరమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందని, రైతులు ఇకనైనా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. కర్షకుల ఆదాయన్నిపెంచడానికి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులతో పాటు కొత్త ఆవిష్కరణలు అవసరమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అదనపు ఆదాయం కోసం తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలపై రైతులు దృష్టిపెట్టాలని సూచించారు.
ఆకాశవాణి ద్వారా మన్‌కీ బాత్ 75వ ఎపిసోడ్లో ప్రసంగించారు మోదీ. గతేడాది మార్చిలో విధించిన జనతా కర్ఫ్యూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇది భారతీయుల క్రమశిక్షణకు గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోందని గుర్తుచేశారు. కరోనాకు టీకా వచ్చినా.. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
స్వాతంత్ర్య సమరయోధులే ఆదర్శం..
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్ గురించి మాట్లాడారు ప్రధాని. "అమృత్ మహోత్సవ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర్య సమరయోధుల పోరాట పటిమ, త్యాగాలను ఆదర్శంగా తీసుకుని.. దేశ పౌరులు తమ బాధ్యతలను నిర్వర్తించాలి. ఓ ప్రదేశం, చరిత్ర లేదా దేశం నుంచి ఏదైనా సంస్కృతి నుంచి పుట్టుకొస్తుంది. మీరు దానిని అమృత్ మహోత్సవ్ సమయంలో వెలుగులోకి తీసుకురావచ్చు" అని అన్నారు. అమృత్ మహోత్సవ్ అసలు అర్థం కొత్త విప్లవమని పేర్కొన్నారు.
మన్‌కీ బాత్‌లో నారీ శక్తి గురించి ప్రస్తావించిన మోదీ.. 10 వేలు పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన మిథాలీ రాజ్‌ను కొనియాడారు. షూటింగ్ ప్రపంచకప్‌లో భారత్‌కు పతకాల పంట పండిస్తున్న క్రీడాకారులను అభినందించారు.
ఇదీ చూడండి: యుద్ధం వచ్చినా భారత్- పాక్ మధ్య వీడని 'ఫోన్ బంధం'!