PM Modi Security Breach Latest News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనలో అప్పటి ఫిరోజ్‌పుర్ జిల్లా ఎస్పీ గుర్విందర్ సింగ్ సంగాపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రస్తుతం బఠిండా జిల్లా ఎస్పీగా ఉన్న గుర్విందర్ను.. తక్షణమే విధుల్లో నుంచి తొలగించాలని పంజాబ్ హోంశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. భద్రతా లోపానికి సంబంధించి దర్యాప్తు చేసిన రాష్ట్ర డీజీపీ.. నివేదికను హోంశాఖకు ఇచ్చారు. ప్రధాని పర్యటన సమయంలో ఫిరోజ్పుర్లో విధుల్లో ఉన్న గుర్విందర్ సింగ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని నివేదికలో డీజీపీ పేర్కొన్నారు. ఈ రిపోర్ట్‌ను పరిశీలించిన హోంశాఖ ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ జరిగింది..
2022 జనవరి 5న ప్రధాని మోదీ పంజాబ్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బఠిండా విమానాశ్రయంలో దిగారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఫిరోజ్‌పుర్ వెళ్లాల్సి ఉండగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో బయల్దేరారు. అయితే మరో 30 నిమిషాల్లో గమ్యస్థానం సమీపిస్తుందనగా... మోదీ వాహనశ్రేణి ఓ పైవంతనపైకి రాగా.. ఆకస్మాత్తుగా వందలాది మంది రైతులు ఆ మార్గాన్ని దిగ్బంధించారు. దీంతో ప్రధాని, ఆయన కాన్వాయ్ దాదాపు 20 నిమిషాలు పాటు వంతనపైనే చిక్కుకుపోయింది. పరిస్థితి ఎంతకీ మెరుగుపడకపోవడం వల్ల ప్రధాని అక్కడి నుంచి వెనుదిరిగారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జరిగిన ఈ ఘటన దేశంలో తీవ్ర రాజకీయ దమారం రేపింది.ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కేంద్ర హోంశాఖ ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కేబినెట్ సెక్రెటేరియట్ కార్యదర్శి సుధీర్ కుమార్ సక్సేనా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ బల్బీర్ సింగ్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ఐజీ ఎస్ సురేశ్‌లు కమిటీలో సభ్యులుగా ఉన్నారు. వీలైనంత త్వరగా నివేదిక అందించాలని హోంశాఖ గతంలో ఈ కమిటీని ఆదేశించింది. ఘటనపై సుదీర్ఘంగా విచారణ జరిపిన ఈ కమిటీ.. పోలీసుల విధి నిర్వహణలో లోపాలున్నట్లు నివేదిక సమర్పించింది.
మోదీ పర్యటనలో భద్రతా లోపం- 150 మందిపై కేసు
సుప్రీంకు 'మోదీ పర్యటన' వ్యవహారం- విచారణకు పంజాబ్ సర్కార్ కమిటీ!