కరోనాపై విజయం సాధించడంలో వైద్యులు, వారి అనుభవాలు విశేషంగా తోడ్పడుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) అన్నారు. ప్రస్తుతం దేశంలోని వైద్యులే కరోనా నిబంధనలను రూపొందించి, అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కొవిడ్ విపత్తు వేళ సేవలందించిన వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ వైద్యుల దినోత్సవం(National Doctors Day) సందర్భంగా భారత వైద్య సంఘం నిర్వహించిన కార్యక్రమంలో మోదీ వర్చువల్‌గా ప్రసంగించారు. వైద్య రంగ బడ్జెట్‌ను తమ ప్రభుత్వం రెట్టింపు చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
"మహమ్మారి కారణంగా.. ఒక్క ప్రాణం పోయినా అది బాధాకరమే. కానీ భారత్.. కరోనా నుంచి లక్షలాది ప్రాణాలను కాపాడింది. దీనికి కారణం వైద్యులు, వైద్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్ల కఠోర శ్రమే. మన దేశంలో అధిక జనాభా.. కరోనా సవాళ్లను మరింత పెంచింది. కానీ, ఇతర అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మనం మెరుగ్గానే ఉన్నాం.
వైద్య మౌలిక సదుపాయాలను ఎలా విస్మరించేవారో గతంలో మనం చూశాం. మా ప్రభుత్వం.. వైద్య రంగ బడ్జెట్‌ను రెట్టింపు చేసింది. వైద్య సదుపాయాలు లేని చోట మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ.50 వేల కోట్లతో రుణ హామీ పథకాన్ని తీసుకొచ్చింది. 2014 వరకు దేశంలో ఆరు ఎయిమ్స్‌లు మాత్రమే ఉండేవి. గత ఏడేళ్లలో 15 ఎయిమ్స్‌ల ఏర్పాటు దిశగా పనులు ప్రారంభమయ్యాయి. వైద్య కళాశాలలు సైతం ఒకటిన్నర రెట్లు పెరిగాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
కొవిడ్ విషయంలో ప్రజలంతా మరింత అవగాహనతో ఉండాలని ప్రధాని మోదీ కోరారు. కరోనా జాగ్రత్తలను పాటించాలని సూచించారు. మహమ్మారి సంబంధిత సమస్యల నుంచి సాంత్వన కోసం యోగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ విషయంపై ప్రముఖ వైద్య సంస్థలు అధ్యయనాలు జరుపుతున్నాయని గుర్తు చేశారు. వైద్య వర్గాలు సైతం యోగాకు మరింత ప్రాచుర్యం కల్పిస్తున్నాయని వివరించారు. టీకా వల్ల కలిగే ప్రయోజనాలపై పరిశోధనలు నిర్వహించాలని వైద్యులకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: డ్రోన్ల ముప్పుపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు