దేశవ్యాప్తంగా కరోనా టీకా పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ నెల16న ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన ఆస్పత్రులకు చెందిన వైద్య సిబ్బందితో ఆయన మాట్లాడనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశంలోని అన్నిప్రాంతాలకు టీకాలను సరఫరా చేసే కార్యక్రమం ఊపందుకుంది. అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలను కార్గో విమానాల ద్వారా దేశంలోని ప్రధాన నగరాలకు చేర్చారు. అక్కడి నుంచి పట్టణాలకు, జిల్లాలకు పటిష్ఠ భద్రత, జాగ్రత్తల మధ్య సురక్షితంగా తరలించారు.
కేంద్రం ఆర్డర్ మేరకు మంగళవారం నుంచి కొవిషీల్డ్ టీకాల సరఫరాను సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. కేంద్రం కొనుగోలు చేసిన 1.1 కోట్ల కొవిషీట్ల్ డోసుల్లో సుమారు 95 శాతాన్ని ఈ రెండు రోజుల్లో వివిధ ప్రాంతాల్లోని 60 కన్‌సైనీ పాయింట్లకు చేరవేసినట్లు సీరం వర్గాలు వెల్లడించాయి. భారత్ బయోటెక్ కూడా తమకు ఆర్డర్ ఇచ్చిన 55 లక్షల వ్యాక్సిన్ డోసులను 11 నగరాలకు సరఫరాచేసింది. పటిష్ట భద్రత, ప్రత్యేక జాగ్రత్తల మధ్య కొవాగ్జిన్ టీకాలను కార్గో విమానాల ద్వారా గన్నవరం, గువాహటి, పట్నా, దిల్లీ, కురుక్షేత్ర, బెంగళూరు, పుణె, భువనేశ్వర్, జైపుర్, చెన్నై, లఖ్‌నవూలకు చేర్చినట్లు భారత్ బయోటెక్ వర్గాలు తెలిపాయి. 55లక్షల డోసుల్లో 16.5లక్షల డోసులను ఉచితంగా అందించింది.
మొదట వారికే..
మరోవైపు ఆరోగ్యరంగ కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు తొలుత టీకాలు వేయాలని నిర్ణయించిన కేంద్రం.. అందులో భాగంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలిరోజున 2 వేల 934 కేంద్రాల ద్వారా సుమారు 3 లక్షల మంది ఆరోగ్యరంగ కార్యకర్తలకు టీకాలు వేయాలని సంకల్పించింది. కొవిడ్ టీకా డోసుల కేటాయింపులో రాష్ట్రాల పట్ల వివక్ష చూపారన్న విమర్శలను కొట్టివేసిన కేంద్రం వ్యాక్సిన్ డోసులను ఆరోగ్య సిబ్బంది నిష్పత్తి ఆధారంగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేటాయించినట్లు స్పష్టం చేసింది. ఇందులో ఏ రాష్ట్రం పట్ల వివక్ష లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని డోసులు సేకరించి రాష్ట్రాలకు కేటాయిస్తామని వెల్లడించింది. ఓ సెషన్‌కు గరిష్ఠంగా 100మందికి మాత్రమే టీకా డోసులను అందించాలని, అంతకుమించి సంఖ్యను పెంచరాదని రాష్ట్రాలకు సూచించింది. అయితే క్రమంగా టీకా కేంద్రాలను పెంచాలని తెలిపింది.