PM Modi Interview : 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిందనుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. తమ తొమ్మిదేళ్ల ప్రభుత్వ రాజకీయ స్థిరత్వానికి.. దేశ ఆర్థిక వృద్ధి 'నేచురల్ బైప్రొడక్ట్' అని మోదీ తెలిపారు. అవినీతి, కులతత్వం, మతతత్వాలకు మన దేశంలో చోటు లేదని అన్నారు. భారత్‌లో 3D(Democracy- Demography- Diversity) ప్రజాస్వామ్యం, యువశక్తి, వైవిధ్యం ఉన్నాయని.. ఇప్పుడు మరో D (Develoment- అభివృద్ధి)ని జోడించామని తెలిపారు. మరికొన్ని రోజుల్లో దిల్లీలో జీ20 శిఖరాగ్ర భేటీ జరగనున్న నేపథ్యంలో ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"బాధ్యతారహితమైన ఆర్థిక విధానాలు.. స్వల్పకాలిక రాజకీయ ఫలితాలను ఇవ్వవచ్చు. కానీ వాటితో పేదలు ఎంతో బాధపడుతున్నారు. ఒకప్పుడు అంతా కేవలం ఒక పెద్ద మార్కెట్‌గా భావించిన భారత్.. ఇప్పుడు ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో భాగమవుతుంది. 'వసుధైవ కుటుంబం' కేవలం నినాదం మాత్రమే కాదు. మన సాంస్కృతిక తత్వాల నుంచి ఉద్భవించిన సమగ్ర తత్వశాస్త్రం. కొన్నేళ్లుగా భారత్.. ఒక బిలియన్ మంది ఆకలితో ఉన్న దేశంగా చూస్తున్నారు. ఇప్పుడు మన దేశం ఒక బిలియన్ ఆకాంక్షించే మనసులు, రెండు బిలియన్ల నెప్యుణ్యమైన చేతులుగా కలిగిన దేశంగా మారనుంది. త్వరలోనే తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఉండనుంది. దశాబ్దం కంటే తక్కువ కాలంలో ఐదు స్థానాలు ఎగబాకిన దేశంగా రికార్డు సృష్టించనుంది."
-- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
'భారత్ అధ్యక్షతతో సానుకూల ప్రభావం'
Modi On G20 Presidency : భారత్ అధ్యక్షత వహించడం వల్ల జీ20పై చాలా సానుకూల ప్రభావం పడిందని ప్రధాని మోదీ తెలిపారు. వీటిల్లో కొన్ని తన మనసుకు దగ్గరైనవి ఉన్నాయని అన్నారు. జీ20లో మన మాటలు, దార్శనికత ప్రపంచానికి భవిష్యత్తు కోసం రోడ్‌మ్యాప్‌గా పరిగణిస్తున్నారని చెప్పారు. దేశంలోని ప్రతి ప్రాంతంలో జీ20 సమావేశాలు నిర్వహించడం సహజమేనని మోదీ అన్నారు. కశ్మీర్, అరుణాచల్ జీ20 సమావేశాలపై పాకిస్థాన్, చైనా అభ్యంతరాలను ప్రధాని మోదీ తోసిపుచ్చారు. దిల్లీ కాకుండా మిగతా ప్రాంత ప్రజలపై తమ దేశ మాజీ నాయకులకు నమ్మకం లేదని.. అందుకే ఎక్కడా ప్రపంచ స్థాయి సమావేశాలను నిర్వహించలేదని చెప్పారు. ఏడాది పొడవునా జరిగిన జీ20కి సంబంధిన కార్యక్రమాల్లో 1.5 కోట్ల మంది భారతీయులు పాల్గొన్నట్లు వెల్లడించారు. జీ20లో తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ భవిష్యత్తుకు కీలకమైనవని చెప్పారు. G20 అధ్యక్షుడిగా ఉన్నా లేకపోయినా, ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పేందుకు చేసే ప్రతి ప్రయత్నానికి మద్దతిస్తామని ప్రకటించారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై..
Modi On Russia Ukraine War : రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపైనా మోదీ స్పందించారు. చర్చలు, సంప్రదింపులతో మాత్రమే వేర్వేరు ప్రాంతాల్లో తలెత్తిన వేర్వేరు సంక్షోభాలను పరిష్కరించుకోగలమన్నారు. "సైబర్ ముప్పులను తీవ్రంగా పరిగణించాలి. సైబర్ ఉగ్రవాదం, ఆన్‌లైన్ రాడికలైజేషన్, మనీలాండరింగ్.. ఓ చిన్న భాగం మాత్రమే. ఉగ్రవాదులు దేశాల సామాజిక స్థిరత్వాన్ని దెబ్బతీయాలనే దారుణ లక్ష్య సాధన కోసం డార్క్‌నెట్, మెవెర్స్, క్రిప్టో కరెన్సీలను వాడుకుంటున్నారు. వార్తలపై విశ్వాసాన్ని ఫేక్ న్యూస్, డీప్ ఫేక్‌లు దెబ్బతీస్తాయి. ఇది సామాజిక అస్థిరతకు కారణమవుతుంది. సైబర్ క్రైమ్‌పై పోరాడేందుకు ప్రపంచ సహకారం అనివార్యం" అని తెలిపారు.
'రుణ సంక్షోభం చాలా ఆందోళన కలిగించే విషయం'
Modi On Debt Crisis : ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణ సంక్షోభం చాలా ఆందోళన కలిగించే విషయమని ప్రధాని మోదీ అన్నారు. జీ20 సదస్సులో రుణ సంక్షోభం వల్ల ఎదురవుతున్న ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంపై గణనీయమైన దృష్టిని భారత్ కేంద్రీకరించిందని మోదీ తెలిపారు. "రుణ సంక్షోభం నిజంగా ప్రపంచానికి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ విషయంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలను వివిధ దేశాల పౌరులు ఆసక్తిగా అనుసరిస్తున్నారు. కొన్ని ప్రశంసనీయమైన ఫలితాలు కూడా ఉన్నాయి" అని మోదీ చెప్పారు.
ఐరాసలో సంస్కరణలు తీసుకురావాల్సిందే!
Modi On UNO : ఐరాసలో సంస్కరణలు తీసుకురావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 20వ శతాబ్దపు మధ్యకాలం నాటి విధానాలు.. 21వ శతాబ్దంలో ప్రపంచానికి సేవలందించలేవని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు మారుతున్న వాస్తవాలను గుర్తించాలని అన్నారు. పెద్ద సంస్థలు కాలానుగుణంగా మారకపోతే.. చిన్న ప్రాంతీయ ఫోరమ్‌లు మరింత ముఖ్యమైనవిగా మారుతాయని అన్నారు. సాంకేతికతకు భారత్ మద్దతు ఇస్తుందని.. తమ విధానాలు ప్రపంచ ఉద్యమానికి సోపానాలని మోదీ తెలిపారు. వాతావరణ మార్పులపై పోరాటంలో అన్నింటికీ సరిపోయే పరిష్కారాలు లేవని చెప్పారు.
Modi Mann Ki Baat : 'మహిళాశక్తికి 'చంద్రయాన్-3' విజయం ప్రత్యక్ష ఉదాహరణ'
PM Rojgar Mela : 'వృద్ధిబాటలో భారత ఆర్థిక వ్యవస్థ.. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు'