PM Modi in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో రూ.18వేల కోట్లు విలువైన వివిధ ప్రాజెక్టుల ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ గత ప్రభుత్వ పాలనలో జరిగిన 10 సంవత్సరాల నష్టాన్ని పూడ్చేందుకు అనుసంధాన మహాయజ్ఞం దేశవ్యాప్తంగా కొనసాగుతోందన్నారు.
దెహ్రాదూన్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని మోదీ. గత ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.
" ఈరోజు ప్రారంభించిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు మహాయజ్ఞంలో భాగమే. గత ప్రభుత్వాలు చేసిన నష్టాన్ని పూడ్చేందుకు మూడింతల వేగంతో పని చేస్తున్నాం. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు ఉత్తరాఖండ్‌ను అగ్రభాగాన నిలబెడతాయి. దిల్లీ-దెహ్రాదూన్ ఎకనామిక్ కారిడార్ కీలకంగా మారనుంది. కేదార్నాథ్ ఆలయ పునర్నిర్మాణ పనులు మా ప్రభుత్వం చేపట్టింది. దాని ద్వారా 2019లో 10లక్షల మందికిపైగా భక్తులు ఆలయ సందర్శన చేశారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి గత ప్రభుత్వాలు చేసింది అంతంతమాత్రమే. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఉత్తరాఖండ్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం రూ.1 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులను మంజూరు చేశాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
యూపీఏపై విమర్శలు..
కొండ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవనాన్ని మెరుగుపరచటమే తన ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా అధికారంలో కొనసాగిన వారి పాలసీలో ఇది ఎక్కడా కనిపించలేదని యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు మోదీ. ఉత్తరాఖండ్‌లో 2007-2014 మధ్య కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.600 కోట్లతో 288 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించిందని, తమ ప్రభుత్వం గడిచిన ఏడేళ్లలో రూ.12వేల కోట్లతో 2వేల కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మించినట్లు చెప్పారు మోదీ. ఆధునిక మౌలిక వసతుల కల్పనలో రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు.
దిల్లీ-దెహ్రాదూన్ ఎకనామిక్ కారిడార్..
రూ.18వేల కోట్ల ప్రాజెక్టుల్లో దిల్లీ-దెహ్రాదూన్ ఎకనామిక్ కారిడార్ ఒకటి. ఈ ప్రాజెక్టును రూ.8300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ కారిడార్ పూర్తయితే దిల్లీ నుంచి దెహ్రాదూన్ ప్రయాణ సమయం ఆరు గంటల నుంచి 2.5 గంటలకు తగ్గుతుంది. ఈ ప్రాజెక్ట్ హరిద్వార్, ముజఫర్‌నగర్, శామ్లి, యమునానగర్, బాఘ్‌పత్, మీరట్, బరౌత్ మీదుగా వెళ్లనుంది. ఇందులో ఆసియాలోనే అతిపెద్ద వైల్డ్ లైఫ్ కారిడార్(12 కిలోమీటర్లు) అవుతుంది. అలాగే, దెహ్రాదూన్‌లోని దాత్ కాళీ ఆలయం సమీపంలో 340 మీటర్ల పొడవైన సొరంగ మార్గం నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: 5లక్షల ఏకే-203 రైఫిల్స్ తయారీకి భారత్ గ్రీన్ సిగ్నల్