Modi covid meeting CMs: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా కేసుల పెరుగుదల, ఒమిక్రాన్ వ్యాప్తి అంశాలపై ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. వచ్చేవారం వారితో భేటీ అవుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు ముఖ్యమంత్రులకు పీఎంఓ సమాచారం అందించనుందని తెలిపాయి.
దేశంలో కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ ముందుగా సమావేశమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసుల కట్టడి, ఆంక్షల అమలు, వ్యాక్సినేషన్ అంశాలపై వారితో చర్చిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. చిన్నారులకు టీకా పంపిణీ తీరుపైనా ఆరా తీసే అవకాశం ఉంది.
దేశంలో కరోనా కేసులు ఇటీవల భారీగా పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 58,097 కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 534మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 4.18 శాతంగా ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చదవండి: ముంబయిలో కొత్తగా 15 వేల కరోనా కేసులు- బంగాల్లో 14,000