భాజపా ప్రభుత్వానికి వారసత్వం అంటే దేశం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కానీ కొందరికి వారసత్వం అంటే సొంత కుటుంబం, సొంత పేరు అని విపక్షాలనుద్దేశించి పరోక్షంగా విమర్శించారు. తమకు వారసత్వం అంటే సంప్రదాయాలు, విశ్వాసం అని.. కానీ కొందరికి వారసత్వం అంటే సొంత విగ్రహాలు, సొంత కుటుంబానికి చెందిన చిత్రపటాలన్నారు.
వారణాసి పర్యటనలో భాగంగా దేవ్ దీపావళి మహోత్సవంలో పాల్గొన్నారు ప్రధాని మోదీ. తొలి దీపాన్ని వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరోనా సంక్షోభంలో ఎన్ని మారినా.. భక్తి, శక్తి, కాశీ మాత్రం మారదని అభిప్రాయపడ్డారు.
మోదీతో పాటు ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ వేడుకలకు హాజరయ్యారు.
కార్తిక పౌర్ణమి సందర్భంగా.. దీపాలతో వారణాసి కళకళలాడింది. ఘాట్లల్లో 15లక్షల దీపాలను వెలిగించారు ప్రజలు.
పర్యటన సాగిందిలా..
తొలుత వారణాసిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో.. ఆరు వరుసల జాతీయ రహదారి-19ని జాతికి అంకితమిచ్చారు మోదీ. వారణాసి అనుసంధానతపై తమ ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు.
అనంతరం బోటులో ప్రయాణించి కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత దేవ్ దీపావళి మహోత్సవంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:- ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన రైతు సమన్వయ సమితి