దేశంలో రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కీలక సంస్కరణలు తీసుకొస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దిల్లీలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. పథకం కింద అర్హులైన 11 కోట్ల మంది రైతులకు.. 16వేల కోట్ల ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 22కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులతోపాటు 1700 రకాలైన విత్తనాలను అందించి పంట ఉత్పాదకతను పెంచనున్నట్లు మోదీ వివరించారు. ఈ సందర్భంగా వ్యవసాయంలో నానో యూరియా ప్రాధాన్యతను తెలిపిన మోదీ.. ఒక సీసా ద్రవరూప యూరియా ఒక బస్తా యూరియాతో సమానమని చెప్పారు. దేశవ్యాప్తంగా 600 కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇప్పటికే ఉన్న 3,30 లక్షల విత్తన దుకాణాలు పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మారనున్నాయని తెలిపారు.
"రైతులతో సత్సంబంధాలు కొనసాగించడానికి.. వారి అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు.. అన్ని అవసరాలకు మద్దతుగా నిలిచేందుకు ఈ కిసాన్ సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇవాళ దేశంలో 600కు పైగా ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలను ప్రారంభించాం. ఎరువుల రంగంలో సంస్కరణలు తీసుకురావాలన్న మా ప్రయత్నంలో భాగంగా భారీ మార్పులు తెచ్చే రెండు అతిపెద్ద సంస్కరణలు తీసుకొచ్చాం."
నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదే వేదికపై అంతర్జాతీయ వీక్లీ ఫెర్టిలైజర్ ఇ-మ్యాగజైన్ ఇండియన్ ఎడ్జ్‌ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఎరువుల బ్రాండ్లపై రైతులు భ్రమలు, అయోమయంలో ఉన్నారని.. ఈ భ్రమలను పటాపంచలు చేసేందుకు కీలక సంస్కరణ తీసుకొచ్చామని మోదీ తెలిపారు. ఎరువుల విక్రయదారులు అధిక కమీషన్ కోసం కొన్ని బ్రాండ్‌లను ప్రోత్సహిస్తున్నారని.. కంపెనీలు తమ ఉత్పత్తులపై ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయని అన్నారు. ఈ భ్రమలను తొలగించేందుకు ఇకపై దేశమంతా ఒకే బ్రాండ్‌లో ఎరువుల విక్రయాలు సాగుతాయని మోదీ తెలిపారు.
"కంపెనీల ప్రచార ఆర్భాటాలు.. ఎరువుల విక్రయదారులు ఎక్కువ కమీషన్ వస్తుందని ఒకే బ్రాండ్ ఎక్కువగా అమ్మడం.. కమీషన్ తక్కువ వచ్చే ఎరువుల బ్రాండ్‌లు అమ్మకపోవడం వల్ల రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇకపై దేశంలోని ఏ మూలకు వెళ్లినా ఒకే పేరుతో.. ఒకే బ్రాండ్‌తో.. నాణ్యవంతమైన ఎరువులను అందిస్తాం. ఆ బ్రాండ్ పేరు భారత్. దేశంలో యూరియా భారత్ బ్రాండ్‌లోనే లభిస్తుంది."
నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఒకే బ్రాండ్‌తో ఎరువుల విక్రయం వల్ల కంపెనీల మధ్య పోటీ తగ్గుతుందన్న మోదీ.. ఇది రైతులకు మేలు చేస్తుందన్నారు. ప్రపంచ సంక్షోభ సమయంలో ఎరువుల దిగుమతులపై అతిగా ఆధారపడడంపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని.. దాన్ని అధిగమించాల్సి ఉందన్నారు. 2014కి ముందు ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు ఎక్కువగా తరలేవన్న మోదీ.. ఎనిమిదేళ్లలో తాము తీసుకొచ్చిన సంస్కరణలను రైతులకు వివరించారు.
ఇవీ చదవండి: హిందీలో మందుల చీటీ.. 'శ్రీ హరి' పేరుతో ప్రిస్క్రిప్షన్.. డాక్టర్ వినూత్న నిర్ణయం
ప్రశాంతంగా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోలింగ్, ఓటింగ్ శాతం ఎంతంటే