కరోనా చికిత్సపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మూఢ విశ్వాసాలను వీడటం లేదు. కొవిడ్ నుంచి నివారణ లభిస్తుందంటూ వందలాది మంది గ్రామస్థులు ఓ ఆలయానికి తరలివచ్చారు. దేవతలమని చెప్పుకుంటున్న ఇద్దరు మహిళలు కొవిడ్ మహమ్మారి చికిత్స పేరిట పంపిణీ చేస్తున్న పవిత్ర జలాన్ని స్వీకరించేందుకు మధ్యప్రదేశ్ రాజ్గంజ్లోని చాతు ఖేడా గ్రామంలో ఓ ఆలయం ముందు బారులు తీరారు.
ఇదీ జరిగింది..
ఇద్దరు మహిళల శరీరాల్లోకి దేవతలు ప్రవేశించారనే పుకార్లతో జనం భారీగా తరలివచ్చారు. వారిద్దరూ కరోనా చికిత్సలో భాగంగా.. ప్రజలపై పవిత్ర జలం చల్లుతూ.. ప్రసాదంగా కూడా ఇస్తున్నారని ప్రజలు తెలిపారు. దీనిని తీసుకున్న తర్వాత తమ గ్రామంలోకి కరోనా రాలేదని.. సోకినప్పటికీ వైరస్ హాని కలిగించదని వివరించారు.
అయితే.. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం అన్నది లేకుండా వందలమంది ప్రజలు ఈ ప్రాంతంలో గుమిగూడటం వల్ల కరోనా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి మధ్యప్రదేశ్‌లో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాతే ఈ ఘటన జరగడం గమనార్హం.
ఇవీ చదవండి: 'కరోనా దుష్ప్రచారాల కట్టడి అత్యంత ఆవశ్యకం'