Parliament Security Breach Master Mind : పార్లమెంట్‌లో బుధవారం దుండగులు సృష్టించిన అలజడి యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ ఘటనపై దిల్లీ పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అయిదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు- విచారణలో కీలక విషయాలు రాబట్టారు. లోక్‌సభలోకి దూకి కలకలం రేపిన మనోరంజన్ అనే వ్యక్తే ఈ ఘటన మొత్తానికి మాస్టర్ మైండ్ అని పోలీసులు తెలిపారు.
Parliament Security Breach Manoranjan : లోక్‌సభలో కలకలం రేపిన ఘటనలో మనోరంజన్, సాగర్ శర్మ, నీలమ్, అమోల్ శిందె, విశాల్, లలిత్ అనే ఆరుగురు నిందితులని పోలీసులు తెలిపారు. ఇందులో మనోరంజన్, సాగర్‌శర్మ లోక్‌సభలోకి చొరబడగా- నీలమ్, అమోల్ శిందే పార్లమెంట్ భవనం వెలుపల గందరగోళం సృష్టించారు. ఈ నలుగురితో పాటు వీరికి సహకరించిన విశాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా లలిత్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
కర్ణాటకలోని మైసూరుకు చెందిన మనోరంజన్ ఒక ఎంపీ నుంచి పార్లమెంటులో ప్రవేశానికి పాస్ తీసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. సాగర్ శర్మను తన స్నేహితుడిగా పేర్కొంటూ అతడికీ పాస్ ఇప్పించాడు. అతడి పిలుపుతోనే మిగతా వారు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల సమయంలో మనోరంజన్ పార్లమెంట్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మనోరంజన్ తీరు నక్సల్స్ భావజాలంతో పోలి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అయితే, ప్రధాన కుట్రదారుడు ఇంకెవరో ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఫోన్లతో పరార్
ఈ ఘటన సమయంలో లలిత్ కూడా పార్లమెంట్ ప్రాంగణంలోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పార్లమెంట్ సమీపంలో నీలమ్, అమోల్ ఆందోళన చేస్తుండగా ఆ వీడియోను ఫోన్లో లలిత్ రికార్డ్ చేసినట్లు తెలిసింది. భద్రతా సిబ్బంది వారిని పట్టుకోగానే నిందితులదరి ఫోన్లతో లలిత్ అక్కడి నుంచి పరారైనట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం ఆ వీడియోను బంగాల్‌కు చెందిన ఓ ఎన్జీఓ సభ్యురాలికి పంపినట్లు తెలుస్తోంది. గతంలో లలిత్ తమ ఎన్జీఓతో కలిసి పనిచేశాడని, పార్లమెంట్ వద్ద ఆందోళనకు సంబంధించి తనకు వాట్సప్‌లో ఓ వీడియో షేర్ చేసి, దాన్ని వైరల్ చేయమని మెసేజ్ చేశాడని ఎన్జీఓ సభ్యురాలు తెలిపారు.
'భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్'తో సంబంధం
నిందితులందరికీ 'భగత్‌సింగ్ ఫ్యాన్ క్లబ్' పేరుతో ఉన్న సోషల్ మీడియా పేజీతో సంబంధం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. 'ఏడాదిన్నర క్రితమే వీరంతా మైసూరులో కలుసుకున్నారు. జులైలోనే సాగర్ లఖ్‌నవూ నుంచి వచ్చాడు. కానీ పార్లమెంట్ భవనంలోకి వెళ్లలేకపోయాడు. డిసెంబర్ 10న ఒక్కొక్కరూ తమ స్వస్థలాల నుంచి దిల్లీకి చేరుకున్నారు. ఇండియా గేట్ వద్ద కలుసుకొని కలర్ క్రాకర్లను పంచుకున్నారు.
లఖ్‌నవూకు చెందిన సాగర్ శర్మ సైతం వామపక్ష భావజాలం నుంచి స్ఫూర్తి పొందాడని సమాచారం. సోషల్ మీడియాలో లెఫ్ట్ భావజాలానికి చెందిన పోస్టులు, కామెంట్లు చేసేవాడని తెలుస్తోంది. అయితే, అతడి ఫేస్బుక్ ఖాతాలు కొద్ది నెలలుగా యాక్టివ్‌గా లేవు. ఫేస్బుక్ సమాచారాన్ని బట్టి కోల్‌కతా, రాజస్థాన్, హరియాణాకు చెందిన చాలా మందితో సాగర్ కాంటాక్టులో ఉన్నట్లు తెలుస్తోంది.