- 16.22PM
పార్లమెంట్ ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా
టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్షాల నిరసనలు చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు సస్పెండ్ అయిన టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ ఓ తీర్మానాన్ని ఆమోదించింది. సభలో ఓబ్రెయిన్ ప్రవర్తనపై దర్యాప్తు చేయాలని ప్రివిలేజెస్ కమిటీకి సిఫార్సు చేసింది. మూడు నెలల్లో నివేదికను సమర్పించాలని కోరింది. మరోవైపు, విపక్ష ఎంపీల సస్పెండ్‌పై నిరసనల నేపథ్యంలో లోక్‌సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. - 15.16PM
మరో 9మంది ఎంపీలపై వేటు
లోక్‌సభలో నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని మరో 9మంది ఎంపీలను శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. అంతకుముందు లోక్‌సభలో ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలు, రాజ్యసభలో టీఎంసీ ఎంపీ సస్పెండ్ అయ్యారు. విపక్షాల నిరసనల నేపథ్యంలో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది.
అయితే, లోక్‌సభ సస్పెన్షన్ లిస్ట్‌లో ఓ ఎంపీ పేరు పొరపాటున చేర్చినట్లు కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి వివరణ ఇచ్చారు. లోక్‌సభలో 13 మంది సస్పెండ్ అయినట్లు తెలిపారు. రాజ్యసభలో ఒకరిపై వేటు పడగా సస్పెన్షన్‌కు గురైన మొత్తం ఎంపీల సంఖ్య 14గా తేలింది. - 2.18PM
ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలపై వేటు
వాయిదా తర్వాత సమావేశమైన లోక్‌సభలో ఆందోళనలు చల్లారలేదు. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని, చర్చకు అవకాశం కల్పించాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. అయితే, సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఐదుగురు కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ప్రకటించారు. - 12.20PM
పార్లమెంట్ శీతాకాల సమావేశాల నుంచి టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రియన్‌ను సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఆయన్ను సస్పెండ్ కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ ఆమోదించింది. డెరెక్ సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడం వల్ల పెద్దల సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. - 11.35AM
ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై విపక్ష ఎంపీల నిరసనల మధ్య ఉభయ సభలు వాయిదా పడ్డాయి. మోదీ ప్రభుత్వం ఈ అంశంపై వివరణ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. అయితే, లోక్‌సభ సెక్యూరిటీ అంశం సెక్రెటేరియట్ పరిధిలో ఉంటుందని స్పీకర్ ఓంబిర్లా పేర్కొన్నారు. అయినా విపక్షాలు శాంతించలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఓంబిర్లా ప్రకటించారు.
మరోవైపు, రాజ్యసభలోనూ విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఫలితంగా సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. - 11.15AM
'పాస్‌ల జారీలో జాగ్రత్తగా ఉందాం'
పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభలో మాట్లాడారు. 'ఘటనను ప్రతిఒక్కరూ ఖండించారు. మీరు(స్పీకర్) కూడా దీన్ని పరిగణనలోకి తీసుకున్నారు. పాస్‌లు జారీ చేసే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్‌లో అవసరమైన జాగ్రత్తలన్నీ తీసుకుంటాం' అని రక్షణ మంత్రి పేర్కొన్నారు. - 10.55AM
ఎనిమిది మంది సిబ్బంది సస్పెండ్!
పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు సంబంధించి లోక్‌సభ సెక్రెటేరియట్ చర్యలు తీసుకుంది. ఎనిమది మంది సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. - 10.40AM
సెక్యూరిటీ పెంపు- బూట్లు తొలగించి చెకింగ్
బుధవారం ఘటన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద భద్రతను మరింత పెంచారు. ఎంపీలను మాత్రమే మకర ద్వారం నుంచి పార్లమెంట్ భవనంలోకి అనుమతిస్తున్నారు. పార్లమెంట్‌లోకి వచ్చే ఇతరులను పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. బుధవారం నాటి ఘటనలో నిందితులు తమ బూట్లలో స్మోక్ క్యాన్లు తీసుకొచ్చిన నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. పార్లమెంట్‌లోకి వచ్చే వారి బూట్లను తొలగించి మరీ చెక్ చేస్తున్నారు.
- 10.30AM
Parliament Security Breach Live Updates : లోక్‌సభలోకి బుధవారం ఇద్దరు ఆగంతుకులు ప్రవేశించి కలకలం సృష్టించిన నేపథ్యంలో గురువారం పార్లమెంట్ల సమావేశాలపై ఆసక్తి ఏర్పడింది. ఈ అంశంపై ప్రభుత్వాన్ని విపక్షాలు నిలదీసేందుకు సిద్ధమయ్యాయి. ఇంత పెద్ద ఘటన జరిగినా ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి నుంచి ప్రకటన రాకపోవడం ఏంటని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి ప్రశ్నించారు. ఘటనపై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
మరోవైపు, భద్రతా లోపంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని లోక్‌సభలో నోటీసులు ఇచ్చారు. రాజ్యసభలో ఈ అంశంపై చర్చ జరపాలని కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా డిమాండ్ చేస్తూ నోటీసులు ఇచ్చారు.
బుధవారం ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ ఛాంబర్లోకి ప్రవేశించడం సంచలనమైంది. జీరో అవర్ జరుగుతున్న సమయంలో విజిటర్ గ్యాలరీ నుంచి సభలోకి దూకేశారు. గ్యాస్ క్యానిస్టర్లను వెంటతెచ్చుకున్న వారు 'నియంతృత్వం నశించాలి' అంటూ సభలో నినాదాలు చేశారు. వారిని ఎంపీలు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. మరోవైపు, పార్లమెంట్ బయట ఓ మహిళ, మరో వ్యక్తి సైతం ఆందోళనకు దిగారు. వారిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం ఆరుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు, ఇప్పటివరకు ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ప్రధాన కుట్రదారుడు ఎవరో?
బుధవారం నాటి ఘటనలో ప్రధాన కుట్రదారుడు మరొ వ్యక్తి అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రాథమిక విచారణను బట్టి ఈ మేరకు అనుమానిస్తున్నట్లు తెలిపారు. నిందితులు ఘటనకు పాల్పడే ముందే పార్లమెంట్ బయట రెక్కీ నిర్వహించారని పోలీసు వర్గాలు తెలిపాయి. 'డిసెంబర్ 10న నిందితులు తమ స్వస్థలాల నుంచి దిల్లీకి చేరుకున్నారు. ఇండియా గేట్ వద్ద కలుసుకున్న వీరు కలర్ క్రాకర్స్‌ను పంచుకున్నారు' అని వివరించాయి.
ఇక్కడే ఐదుగురు నిందితుల బస!
ఈ ఘటనలో నిందితులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో గురుగ్రామ్‌లో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విక్కీ శర్మ అలియాస్ జాంగ్లి, అతడి భార్యను క్రైమ్ బ్రాంచ్ అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు నిందితులు వీరి ఇంట్లోనే బస చేశారని సమాచారం. నిందితులంతా విక్కీకి స్నేహితులేనని తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు.