పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల రెండోరోజూ సభలో దుమారం రేగింది. ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. అదానీ- హిండెన్‌బర్గ్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబట్టగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికార పక్ష ఎంపీలు లోక్‌సభలో నినాదాలు చేశారు. భారత ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యులు ఆందోళనలు కొనసాగించాయి. సభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే అధికార, విపక్ష సభ్యులు పరస్పరం నినాదాలు చేసుకున్నారు.
క్వశ్చన్ అవర్‌ను కొనసాగించేందుకు సహకరించాలని స్పీకర్ ఓం బిర్లా కోరినప్పటికీ.. సభ్యులు వినిపించుకోలేదు. సభలో ప్లకార్డులు ప్రదర్శించొద్దని కాంగ్రెస్ సభ్యులకు ఓం బిర్లా సూచించారు. నిల్చున్న సభ్యులందరూ కూర్చోవాలని కోరారు. అయితే, కాంగ్రెస్ సభ్యులు తమ ఆందోళనలను కొనసాగించారు. దీంతో లోక్‌సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓంబిర్లా ప్రకటించారు. ఆ తర్వాత సమావేశమైనప్పటికీ.. సభ్యుల ఆందోళనలు ఆగలేదు. దీంతో బుధవారం ఉదయానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఓంబిర్లా.
మరోవైపు, రాజ్యసభలో కార్యకలాపాలు కాసేపు సజావుగా సాగాయి. భారత్‌కు ఆస్కార్ అవార్డులు సాధించి పెట్టిన ఆర్ఆర్ఆర్, ది ఎలిఫెంట్ విస్పరర్స్ చిత్ర బృందాలకు పెద్దల సభ ఎంపీలు అభినందనలు తెలియజేశారు. ఆస్కార్ అవార్డులు రావడం.. దేశంలో ఉన్న ప్రతిభకు అంతర్జాతీయంగా దక్కిన గొప్ప ప్రశంస అని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ఈ అవార్డుల ద్వారా.. ప్రపంచంలో భారతదేశానికి మరో గుర్తింపు లభించినట్లైందని అన్నారు.
అయితే, ఆస్కార్ పురస్కారాలపై చర్చ పూర్తైన తర్వాత సభలో రగడ మొదలైంది. అదానీ షేర్ల పతనం- హిండెన్‌బర్గ్ రిపోర్టుపై చర్చించాలని కోరుతూ విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. మరోవైపు, రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన ప్రసంగం అంశాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో లేవనెత్తారు. దీంతో సభలో గందరగోళం తలెత్తింది. చివరకు, రాజ్యసభ మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సమావేశమైనా.. పరిస్థితిలో మార్పు రాలేదు. ఫలితంగా బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు.
వేర్వేరుగా విపక్షాల నిరసన
సభ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఎదుట విపక్షాలు వేర్వేరుగా ఆందోళన చేశాయి. అదానీ- హిండెన్‌బర్గ్ వ్యవహారంపై చర్చకు అనుమతించాలని, ఆ అంశంపై దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేశారు. పార్లమెంట్‌ను సజావుగా సాగకూడదని ప్రభుత్వమే భావిస్తోందని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. అధికారంలో ఉన్న పార్టీ సభ్యులే సభలో ఇలా ఆందోళన చేయడం ఎప్పుడూ చూడలేదని అన్నారు. రాహుల్ గాంధీ ఎందుకు క్షమాపణ చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రమే ఆయనకు సారీ చెప్పాలని అన్నారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్లులు ప్రదర్శించారు. మరోవైపు, బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కలిసి పార్లమెంట్ ఆవరణలో ఆందోళన నిర్వహించారు.
రాహుల్ గాంధీ ఇటీవల లండన్‌లో పర్యటించారు. భారత ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని అక్కడ నిర్వహించిన ఓ సమావేశంలో ఆరోపించారు. దేశంలోని అన్ని సంస్థలపైనా దాడి జరుగుతోందని అన్నారు. విపక్ష ఎంపీలకు పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించడం లేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు. దేశాన్ని అవమానించేలా ఆయన మాట్లాడారని ఆరోపిస్తున్నారు. ఇందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళనల మధ్య సోమవారం సైతం ఎలాంటి కార్యకలాపాలు లేకుండా సభలు వాయిదా పడ్డాయి.