పానిపత్.. దేశ రాజధాని దిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చారిత్రక నగరం. చరిత్రలో ఎన్నో యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచిన పానిపత్ వేదికగా బాబుర్, హుమాయున్, ఇబ్రహీం లోధీ లాంటి వీరులు చేసిన పోరాటాలు.. భారతదేశ చరిత్రలో ప్రత్యేకంగా నిలచిపోయాయి. ఇక్కడ ఇప్పటికీ దర్శనమిస్తున్న శతాబ్దాల కిందటి వారసత్వ సంపద పానిపత్ మహోన్నత చరిత్రకు అద్దం పడుతోంది. కలందర్ షా దర్గాను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యటకులు పానిపత్‌కు వస్తారు. ఈ నగరానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశానికే టెక్స్‌టైల్ హబ్‌గా అవతరించిన పానిపత్ జిల్లా నుంచి.. ఏడున్నర వేల కోట్ల రూపాయల విలువైన హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి.
"1948లోనే పానిపత్‌లో హ్యాండ్‌లూమ్ పరిశ్రమ ప్రారంభమైంది. అప్పటినుంచీ నగరం వెనక్కి తిరిగి చూడలేదు. ఇక్కడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు కష్టపడి పనిచేశారు. ఏటా ఏడున్నర వేల కోట్ల రూపాయల విలువైన హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి జిల్లా ఎదిగింది. దేశీయంగా అయితే...రోజుకు 10వేల కోట్ల రూపాయల విలువ చేసే ఫర్నిషింగ్, దిండ్లు, పరదాల వస్త్రాలు దేశంలోని ప్రతి మూలకూ చేరుతున్నాయి."
- రోషన్ లాల్ గుప్తా, హరియాణా ఉద్యోగ, వ్యాపార మండలి ఛైర్మన్
ప్రపంచంలోనే నం.1
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతి నుంచి పానిపత్‌లో హ్యాండ్లూమ్ వ్యాపారం కళకళలాడుతోంది. ఇక్కడ తయారయే దుప్పట్లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం రీసైకిల్ చేసిన దారాలతో విశ్వవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలుస్తోంది పానిపత్. 1987 నుంచే ఇక్కడి దారాలు అన్ని దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. దారాల రీసైక్లింగ్‌లో పానిపత్ ప్రపంచంలోనే నంబర్ వన్ అనిపించుకుంటోంది.
" ఇక్కడ హ్యాండ్‌లూమ్స్ ప్రారంభించిన సమయంలో కాన్పూర్, అహ్మదాబాద్ ప్రాంతాలు టెక్స్‌టైల్ రంగంలో మాంచెస్టర్‌గా పేరుతెచ్చుకున్నాయి. కానీ ఇప్పుడు పానిపత్‌లోని హ్యాండ్‌లూమ్ పరిశ్రమ ప్రపంచంలోనే ఉత్తమమైనదిగా గుర్తింపు పొందింది. పానిపత్ నుంచి దేశం మొత్తానికే కాదు.. ప్రపంచవ్యాప్తంగా నూలు సరఫరా చేస్తాం."
- రోషన్ లాల్ గుప్తా, హరియాణా ఉద్యోగ, వ్యాపార మండలి ఛైర్మన్
రోజుకు 20వేల కిలోల దారాలు..
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు నూలు ఎగుమతి చేస్తున్నప్పటికీ... శ్రీలంక, నేపాల్, రష్యా, అమెరికా, జర్మనీ, టర్కీ, నెదర్లాండ్, ఫిన్‌లాండ్, ఫ్రాన్స్, బల్గేరియా, బెల్జియం దేశాలు అత్యధికంగా కొనుగోలు చేస్తున్నాయి. రోజుకు 400 స్పిన్నింగ్ యంత్రాలు 20 వేల కిలోల దారాలు ఉత్పత్తి చేస్తాయి. కాటన్, వివిధ రకాల పాలిస్టర్ దారాలు ఉత్పత్తవుతాయి. వాటిలో 20 శాతం పానిపట్ హ్యాండ్లూమ్ ఉత్పత్తుల తయారీకే వాడతారు. డోర్‌మ్యాట్, పరదాలు, దుప్పట్లు, ఫర్నిచర్ వస్త్రాలు, ఇతర ఉత్పత్తుల తయారీలో ఈ దారాలు వినియోగిస్తారు.
" నూలు ఇక్కడే వడికి, ఇక్కడే ఉత్పత్తులు తయారుచేయడమే పానిపత్ ప్రత్యేకత. దారంతో పాటు వస్త్రం కూడా ఇక్కడే తయారవుతుంది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలోనూ ఇలాంటి కేంద్రాలు చాలానే ఉన్నాయి. కాకపోతే దారం, వస్త్రాల్లో ఏదో ఒకటి మాత్రమే తయారవుతాయి. మేం మాత్రం రెండూ చేస్తాం."
- రోషన్ లాల్ గుప్తా, హరియాణా ఉద్యోగ, వ్యాపార మండలి ఛైర్మన్
పాత దుస్తుల నుంచి దారాలు..
వివిధ దేశాల నుంచి మిలియన్ల టన్నుల కొద్దీ వాడిన దుస్తులను పానిపత్‌లోని స్పిన్నింగ్ పరిశ్రమలు సేకరిస్తాయి. రంగుల వారీగా వాటిని వేరుచేసి, నూలు ఉత్పత్తి చేస్తారు. యంత్రాల సాయంతో దారాలుగా చేస్తారు. పాత దుస్తుల నుంచి కొత్త దారం తయారు చేసేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే ఈ రంగంలో పానిపత్ జిల్లా ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడి దారాలు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటాయి. ఆ ధరకు ఇతర ప్రాంతాల్లో కనీసం దారానికి రంగు కూడా అద్దలేరు.
" భవిష్యత్తంతా దారాల రీసైక్లింగ్‌దే. ఇందుకోసం దారానికి రంగు అద్దేందుకయ్యేంత ఖర్చే అవుతుంది. దారాలకు రంగు అద్దేందుకు ఎంతైతే ఖర్చవుతుందో, ఆ ధరకే రీసైకిల్ చేసిన దారాలు అమ్ముతాం. పానిపత్‌లో తయారయే నూలు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుంది."
- సురేష్ కబ్రా, వ్యాపారి
దేశవ్యాప్తంగా నూలు రీసైకిల్ చేసే పరిశ్రమల్లో 80 శాతం పానిపత్‌లోనే ఉన్నాయి. ఈ రంగం రోజుకు 500 కోట్ల రూపాయల టర్నోవర్ సాధిస్తోంది. ఈ పరిశ్రమ మీద ఆధారపడి జిల్లాలో 4వేల మంది జీవిస్తున్నారు. అలాంటి పానిపత్‌ను సిటీ ఆఫ్ థ్రెడ్స్‌గా పిలవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.