సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు.. సాగు చట్టాలపై తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి చర్చలు చేపడతారని పేర్కొన్నారు వారిలో ఒకరైన అనిల్ ఘన్వత్. కమిటీ సభ్యులు ఏ ఒక్క పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ అనుకూలం కాదని స్పష్టం చేశారు.
కమిటీ ఏర్పాటు తర్వాత మంగళవారం తొలిసారి సమావేశమయ్యారు సభ్యులు. ఈ సందర్భంగా రైతులు, ఇతర భాగస్వామ్యపక్షాలతో తొలి దఫా చర్చలు గురువారం (జనవరి 21న) నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
" తమ ముందుకు వచ్చి మట్లాడేందుకు రైతులను ఒప్పించటమే ప్యానల్ ముందున్న అతిపెద్ద సవాల్. మా శక్తి మేర ప్రయత్నిస్తాం. నూతన సాగు చట్టాలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు రైతులు, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను తెలుసుకుంటాం. కమిటీ సభ్యులు సాగు చట్టాలపై తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి.. సుప్రీం కోర్టుకు సమర్పించే నివేదిక రూపొందిస్తారు. మాకు ఇచ్చిన బాధ్యతకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తాం."
- అనిల్ ఘన్వత్, సుప్రీం కమిటీ సభ్యులు
కమిటీ సభ్యులంతా ప్రభుత్వ అనుకూలవాదులేనని పలు రైతు సంఘాలు, విపక్షాలు ఆరోపిస్తున్న క్రమంలో తాము ఏ ఒక్క పార్టీ, ప్రభుత్వం తరఫున రాలేదని స్పష్టం చేశారు ఘన్వత్. తాము సుప్రీం కోర్టుకు మాత్రమే నిబద్ధులమని తెలిపారు. తమ ముందుకు వచ్చి మాట్లాడాలని రైతులను కోరారు. తమకు తెలిపిన ప్రతి అంశాన్ని కోర్టు ముందు ఉంచుతామని పేర్కొన్నారు. తొలి సమావేశంలో నేరుగా హాజరుకాలేని వారి కోసం వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఘన్వత్.
ఇదీ చూడండి: 'వ్యవసాయ రంగం నాశనానికే ఆ చట్టాలు'