పాకిస్థాన్ సింధు కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం సోమవారం భారత్కు చేరుకుంది. మంగళ, బుధవారాల్లో(ఈ నెల 23, 24న) సింధు నదీ వార్షిక సమావేశాలు జరగనుండగా.. దానికి ఈ ప్రతినిధుల బృందం హాజరుకానుంది. ఇరు దేశాల కమిషనర్లు పాల్గొనే ఈ భేటీలో.. సింధు జలాల ఒప్పందంపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తోంది.
భారత ప్రతినిధి బృందానికి పీ.కే.సక్సేనా నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు కేంద్ర జల కమిషన్, కేంద్ర విద్యుత్ అథారిటీ, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ సలహాదారులు పాల్గొననున్నారు.
స్నేహపూర్వకంగానే..
చీనాబ్ నదిపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టులపై పాక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో.. ఈ అంశమై చర్చించే అవకాశముంది. అయితే.. సింధు జలాల ఒప్పందం(ఐడబ్ల్యూటీ) ఒప్పందానుసారం.. స్నేహపూర్వకంగానే తమ సమస్యల్ని పరిష్కరించుకుంటామని సక్సేనా వెల్లడించారు.
1960లో జరిగిన సింధు జల ఒప్పంద నిబంధనల ప్రకారం.. ఇరు దేశాల కమిషనర్లు పాక్ లేదా భారత్లో ఏడాదికి ఓసారి భేటీ కావాల్సి ఉంటుంది. అయితే.. కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది మార్చిలో దిల్లీ వేదికగా జరగాల్సిన తొలి సమావేశం రద్దయింది. రెండు దేశాలు చివరిసారిగా 2018 ఆగస్టులో లాహోర్‌లో సమావేశమయ్యాయి.
జమ్ముకశ్మీర్లో అధికరణ-370 రద్దు అనంతరం.. తొలిసారి జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: 'కరోనాతో మరణించిన సైనికులకు పరిహారం ఉండదు'