కొవిడ్ మహమ్మారి విజృంభిస్తోన్న వేళ.. కర్తార్‌పుర్‌లో ఉన్న సిక్కుల పవిత్ర క్షేత్రం సందర్శనకు భారత యాత్రికులను అనుమతి ఇస్తామని పాకిస్థాన్ వెల్లడించింది. అయితే, రెండు డోసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. సిక్కుల మత వ్యవస్థాపకులు, గురువు గురునానక్ 482వ వర్థంతి (సెప్టెంబర్ 22) సందర్భంగా వచ్చే నెల నుంచి యాత్రికులను అనుమతిస్తామని తెలిపింది. ఇరు దేశాల్లో కొవిడ్ ప్రభావం కారణంగా గతేడాది (2020) మార్చి నుంచి కర్తార్‌పుర్‌కు భారత యాత్రికులను పాకిస్థాన్ అనుమతించడం లేదు.
కొవిడ్ మూడో వేవ్ ప్రభావానికి వణికిపోతోన్న పాకిస్థాన్, విదేశాల నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా డెల్టా వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో భారత్‌ను పాకిస్థాన్ కేటగిరీ-సీ లో ఉంచింది. దీంతో అక్కడికి వెళ్లే వారితోపాటు యాత్రికులకు ప్రత్యేక అనుమతి అవసరం. తాజాగా కర్తార్‌పుర్ గురుద్వారా యాత్రికుల విషయంలో మల్లగుల్లాలు పడిన పాక్.. చివరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిని అనుమతిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా 72గంటలలోపు ఉన్న ఆర్‌టీపీసీఆర్ టెస్టు రిపోర్టును కూడా తీసుకురావాలని సూచించింది.
సిక్కుమత స్థాపకులు బాబా గరునానక్ దేవ్ వర్థంతిని పురస్కరించుకొని కర్తార్‌పుర్ గురుద్వారాలో సెప్టెంబర్ 20 నుంచి మూడు రోజులపాటు ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో భారత నుంచి వచ్చే సిక్కు యాత్రికులను అనుమతించడంపై పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అండ్ ఆపరేషన్ సెంటర్ (NCOC) సమీక్షించింది. అనంతరం భారత్ నుంచే వచ్చే సిక్కు యాత్రికులను అనుమతించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇక్కడికే వచ్చే యాత్రికులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని NCOC స్పష్టం చేసింది.
ఇదిలాఉంటే, పాకిస్థాన్‌లో కర్తార్‌పుర్ మందిరాన్ని సందర్శించేందుకు వీలుగా ఇరు దేశాల మధ్య ప్రత్యేక కారిడార్ ఈమధ్యే అందుబాటులోకి వచ్చింది. పాకిస్థాన్‌లోని దర్బార్ సాహిబ్ ఆలయం నుంచి పంజాబ్‌లోని డేరాబాబా నానక్ మందిరాన్ని కలిపే ఈ కారిడార్ 2019 నవంబర్‌లో ఇటు భారత ప్రధాని నరేంద్రమోదీ, అటు పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌లు ప్రారంభించారు. పాస్‌పోర్ట్ లేకుండానే భారత్ నుంచి సిక్కు యాత్రికులు ఆ ప్రదేశానికి వెళ్లే అవకాశం కూడా కల్పిస్తున్నారు.
ఇదీ చూడండి: 'తాలిబన్ల నుంచి బయటపడ్డాం- ఇక మనం భద్రం!'