Anthrax in Kerala: కేరళలోని అథిరాపల్లి అటవీ ప్రాంతంలో ఆంత్రాక్స్ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఇటీవల అడవి పందులు వరుసగా మృత్యువాత పడటాన్ని గమనించిన అధికారులు.. వాటి నమూనాలను పరీక్షలకు పంపారు. అడవి పందులు ఆంత్రాక్స్‌తోనే చనిపోయినట్లు నిర్ధరణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
అథిరాపల్లి అటవీ ప్రాంతంలోని కొన్ని అడవి పందుల్లో ఆంత్రాక్స్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అయితే ఆంత్రాక్స్ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అడవి పందులతో పాటు ఇతర జంతువులు మూకుమ్మడిగా మృత్యువాత పడితే.. అధికారులకు సమాచారం అందిచాలని, ప్రజలకు అలాంటి ప్రదేశాలకు వెళ్లవద్దని సూచించారు. ఆంత్రాక్స్ వ్యాధి పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. పశువులకు టీకాలు వేసే సమయంలో ఆంత్రాక్స్ నివారణ చర్యలపై అవగాహన కల్పించేదుకు సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
Anthrax what happens: పశువులు, గొర్రెలు, మేకలకు సోకే దొమ్మరోగం లేక నెత్తురెంక లేక రక్తపు దొమ్మ వ్యాధిని ఆంగ్లంలో ఆంత్రాక్స్‌గా పిలుస్తారు. జీవాలు తాగేనీరు, తినే గ్రాసం, ఇతర కీటకాల ద్వారా వాటి రక్తంలోకి ఈ వైరస్ ప్రవేశించి వేగంగా పెరిగి 2, 3 రోజుల్లోనే ప్రాణాన్ని బలిగొంటుంది. ఈ వ్యాధి సోకిన జీవాల కళేబరాలను ఊరికి దూరంగా 3 అడుగుల లోతు గొయ్యి తవ్వి సున్నం వేసి పూడ్చిపెట్టాలి. అవి చనిపోయిన ప్రాంతంలోని చెత్తనంతా తగలబెట్టేయాలి. కొన్నిసార్లు ఆయా జీవాలు ఆంత్రాక్స్‌తో చనిపోయిన విషయం తెలియక.. వాటిని కోసి మాంసం ఇతరులకు అమ్మడం లేదా కాపరులే వండుకుని తినడం జరుగుతోంది. వాటిని కోసి తినకపోయినా, కళేబరాలను నిర్లక్ష్యంగా వదిలేయడమూ ప్రమాదకరమే. కొందరు వాటి చర్మాన్ని ఒలిచి తీసుకుంటున్నారు. ఆ చర్మం ముట్టుకున్నవారికి, ఆ మాంసం తిన్న కాకులు, కుక్కలు, ఇతర పురుగుల ద్వారా ఆ వైరస్ ప్రజలకు సోకే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 'ఎంఎస్ఎంఈలకు 8 ఏళ్లలో 650% పెరిగిన కేటాయింపులు'