Orphanage For Police Dogs : సమాజంలో శాంతిభద్రతల కోసం సేవలందించిన పోలీసు జాగిలాల కోసం మధ్రప్రదేశ్ పోలీసుశాఖ వృద్ధాశ్రమాన్ని నిర్మించింది. భోపాల్‌లోని పోలీసు జాగిలాల శిక్షణ కేంద్రంలోనే.. ఈ ఆశ్రమాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దింది. జీవితం మొత్తం సమాజ శ్రేయస్సుకే అంకితం చేసిన జాగిలాలను.. పదవీ విరమణ చేయించిన తర్వాత ఇక్కడికి తరలిస్తున్నారు. ప్రత్యేకమైన వసతుల మధ్య అవి గౌరవంగా వృద్ధాప్య జీవితం గడిపేలా చేస్తున్నారు అక్కడి పోలీసులు. ప్రస్తుతం వివిధ జాతులకు చెందిన 18 జాగిలాలు ఇక్కడ ఉన్నాయి. నిపుణుల ఆధ్వర్యంలో వీటికి ఆరోగ్య పరీక్షలు జరుపుతున్నారు.
"ప్రస్తుతం ఇక్కడ 18 జాగిలాలు ఉన్నాయి. వాటి వయసు 10 నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉంది. జర్మన్ షెఫర్డ్, లాబ్రడార్, కాకర్ స్పేనియల్ వంటి జాతులతో పాటు రాంపుర్ గ్రేహౌండ్, కన్ని వంటి జాతి రకం శునకాలు ఇక్కడ ఉన్నాయి."
-- మంగ్లీంద్ర సింగ్ పర్మార్, ఇన్‌ఛార్జ్
సీసీ కెమెరాలు.. మ్యూజిక్ సిస్టమ్ కూడా..
Police Dogs Orphanage : ఈ వృద్ధాశ్రమంలో 6 గదులు ఉన్నాయి. జాగిలాల కోసం.. పరుపులు, కూలర్లు, ఫ్యాన్లు కూడా ఉన్నాయి. వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జాగిలాలు సంగీతం వింటూ ఆనందంగా, ఉత్సాహంగా ఉండేందుకు.. మ్యూజిక్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.
"ఈ జాగిలాలు 10 ఏళ్లు విధులు నిర్వహించి పదవీవిరమణ పొందాయి. సర్వీసు మధ్యలో అనారోగ్యానికి గురైనవి కూడా ఇందులో ఉన్నాయి. వాటిని మేం జాగ్రత్తగా చూసుకుంటాం. అన్ని జిల్లాల్లో కన్నా మేము వాటిని జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే అవి వాటి జీవితాన్ని మా పోలీసు శాఖ కోసమే అంకితం చేశాయి."
-- మనోజ్ కుమార్, పోలీసు కానిస్టేబుల్
ఆ శునకాలకు స్పెషల్ బెడ్లు..
ఇక్కడున్న జాగిలాల్లో కొన్ని.. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి అవార్డులు పొందినవి కూడా ఉన్నాయి. విధి నిర్వహణలో గాయపడిన జాగిలాలకు.. సాధ్యమైనంత వరకు ఆ బాధ నుంచి ఉపశమనం కలిగేలా.. నడక యంత్రాలను కూడా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఆర్థ్రైటిస్‌కు గురైన శునకాల కోసం ప్రత్యేకంగా బెడ్లను అందుబాటులో ఉంచారు.