దిల్లీలో కరోనా విజృంభణకు పోలీసులు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఓ పోలీస్ వైరస్ బారిన పడుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత రెండు నెలల్లోనే 4,200 మందికి కరోనా సోకింది. వారిలో 25 మంది చనిపోయారు. ఇప్పటివరకు మొత్తం 11,500 మంది దిల్లీ పోలీసులకు పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. 59 మంది పోలీసులు మరణించినట్లు పేర్కొన్నారు.
లెఫ్టినెంట్ గవర్నర్ భద్రతా సిబ్బంది యూనిట్‌లోని 145 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. ప్రధాన మంత్రి భద్రతా విభాగంలో విధులు నిర్వహించే 65 మంది పోలీసులూ బాధితులయ్యారు. ఓ ప్రత్యేక కమిషనర్, ముగ్గురు జాయింట్ కమిషనర్లు, ఆరుగురు డీసీపీలకు ఇటీవలే వైరస్ సోకింది. దిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో 100 మందికిపైగా పాజిటివ్‌గా తేలింది.
ఈ నేపథ్యంలో కరోనా చికిత్స తీసుకుంటున్న పోలీసుల ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కమిషనర్ ఎస్ఎన్ శ్రీవాస్తవ అధికారులను అదేశించారు.
100మంది క్రైస్తవ మతబోధకులకు..
కేరళ మున్నార్‌లో 100మంది క్రైస్తవ మతబోధకులకు కరోనా సోకింది. గత నెలలో నిర్వహించిన యానువల్ రిట్రీట్‌లో 480 మందికిపైగా మతబోధకులు పాల్గొన్నారని, ఎవరూ బౌతిక దూరం, మాస్కులు ధరించలేదని తమదృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో కరోనా సోకి ఇద్దరు చనిపోయారని, మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఏప్రిల్ 13 నుంచి 17 మధ్య జరిగిన ప్రార్థనా సమావేశాల్లో వీరంతా పాల్గొన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: 'కరోనా మూడోదశ అనివార్యం- ఎదుర్కొనేందుకు సిద్ధం!'