Adil Altaf: తండ్రి టైలర్. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. పుట్టినప్పుడు పిల్లాడు నడవలేడని చెప్పిన వైద్యులు. ఈ పరిస్థితులేవి ఈ యువకుడి లక్ష్యాన్ని అడ్డుకోలేకపోయాయి. లక్ష్య సాధన కోసం అహర్నిశలు శ్రమించి 18 ఏళ్లకే ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పసిడి పతకం కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో భారత జెర్సీ ధరించి దేశానికి పతకాన్ని సాధించి పెట్టడమే తన అంతిమ లక్ష్యమని చెబుతున్నాడు ఈ యువ కెరటం. ఇతనే జమ్ముకశ్మీర్‌కు చెందిన ఆదిల్ అల్తాఫ్. ఈయన తండ్రి లాల్బజార్లో టైలర్ దుకాణం నడుపుతున్నాడు.
ఇటీవల జరిగిన ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఆదిల్ అల్తాఫ్ అదరగొట్టాడు. జమ్ముకశ్మీర్ తరఫున ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో సైక్లింగ్ విభాగంలో తొలి స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించాడు.
15 ఏళ్ల వయసులో ఆదిల్ అల్తాఫ్.. కశ్మీర్ హార్వర్డ్ స్కూల్లో జరిగిన సైక్లింగ్ ఈవెంట్‌లో తొలిసారి పాల్గొన్నాడు. ఆ రేసులో విజేతగా నిలిచి.. అక్కడి నుంచి సైక్లింగ్‌ను మరింత సీరియస్‌గా తీసుకున్నాడు. కొడుకు ఉత్సాహం, సైక్లింగ్‌పై ఉన్న ఇష్టం చూసి.. పగలు రాత్రి తేడా తెలియకుండా టైలరింగ్ చేసి పైసా పైసా కూడబెట్టి ఆదిల్‌కు రేసింగ్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు తండ్రి. ఆ తరువాత స్థానికంగా నిర్వహించిన పలు ఈవెంట్స్‌లో ఆదిల్ ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు.
''నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. అందుకు అవసరమైన సమయాన్ని కేటాయించేవాడిని. అటు చదువు, ఇటు స్లైక్లింగ్.. రెండూ బ్యాలెన్స్ చేసుకుని ప్రాక్టీస్ చేసేవాడిని. రోజు పొద్దునే నాలుగు గంటలు.. సాయంత్రం అయిదు గంటలు సాధన చేశాను. అనుకున్నది సాధించాను.''
-ఆదిల్ అల్తాఫ్
ఆదిల్ అల్తాఫ్ ప్రదర్శనకు మెచ్చిన శ్రీనగర్‌లోని ఎస్‌బీఐ.. రూ.4.5 లక్షల ఎంటీబీ బైక్‌ను గిప్ట్‌గా ఇచ్చింది. ఇక ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పతకం సాధించాలనే కాంక్షతో ఆదిల్ అల్తాప్ గత ఆరు నెలలుగా పాటియాలాలోని ఎన్‌ఐఎస్‌లో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా స్వర్ణం సాధించడంతో ఆదిల్ అల్తాఫ్ తన కలను నెరవేర్చుకున్నాడు.
"పుట్టినప్పుడు ఆదిల్ అల్తాఫ్ నడవడం కష్టమని వైద్యులు చెప్పారు. అప్పుడు మా కుటుంబ సభ్యులం చాలా బాధ పడ్డాం. ఆదిల్ కవల సోదరి ఆరోగ్యంగా ఉంది. శారీరకంగానూ బలంగా ఉంది. కానీ ఆదిల్ అలా లేడు. అల్లా ఆశీర్వాదం వల్ల నా బిడ్డ సైక్లింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించాడు. నడవడమే కష్టమనుకున్న బిడ్డ బంగారు పతకం సాధించం చాలా ఆనందంగా ఉంది. అల్లా దయ వల్లే ఆదిల్ ఆరోగ్యం కుదుటపడింది."
-అల్తాఫ్ అహ్మద్, ఆదిల్ తండ్రి
ఆదిల్ స్వతహాగా ఇటాలియన్ సైక్లింగ్ ప్రొఫెషనల్ ఫిలోప్పి ఘనాకి వీరాభిమాని. ఆసియా, కామన్వెల్త్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని కసిగా ఉన్నాడు. అలాగే భారత్ జెర్సీని ధరించాలని కలలు కంటున్నాడు. ఈ రెండు పతకాలు సాధించిన తరువాత తన తదుపరి లక్ష్యం.. ఒలింపిక్స్ అని చెబుతున్నాడు.
ఇవీ చదవండి: చెరువులా మారిన హైవేపై చేపల వేట.. వరదలో కొట్టుకుపోయిన యువకుడు
'నా భర్త లిప్‌స్టిక్ పెట్టుకుంటున్నాడు.. సెక్స్ చేయట్లేదు'.. కోర్టు మెట్లెక్కిన మహిళ