Presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు. మొత్తం 115 పత్రాలు దాఖలయ్యాయి. అందులో 28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి గురువారం పరిశీలించారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని 79 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.
రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రమే బరిలో మిగిలే అవకాశం ఉంది.
దేశ ప్రథమ పౌరుడి పదవి కోసం ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాతో పాటు పలువురు సామాన్యులు నామినేషన్ దాఖలు చేశారు. వీరిలో ముంబయి మురికివాడకు చెందిన ఓ వ్యక్తి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పేరుతో ఉన్న మరో వ్యక్తి, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ ఉన్నారు.
జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహిస్తారు. 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఇవీ చదవండి: అందరిచూపు రాజ్భవన్వైపే.. మహారాష్ట్రలో నెక్ట్స్ ఏంటి?
'మహా' సీఎంగా ఫడణవీస్.. డిప్యూటీ సీఎంగా శిందే.. ముహూర్తం ఫిక్స్!