Mha omicron: డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలన్న ప్రభుత్వ ప్రణాళికపై ఒమిక్రాన్ ప్రభావం పడినట్టు కనిపిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో.. విమాన సేవల పునరుద్ధరణపై సమీక్ష నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అదే సమయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు చేయాల్సిన పరీక్షలు, నిఘాకు సంబంధించిన ఎస్ఓపీని కూడా సమీక్షించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో జరిగిన అత్యవసర సమావేశంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధికారులు ఈ భేటీలో చర్చించారు(omicron variant). దేశంలో వైరస్ కట్టడి చర్యలను ఏ విధంగా మెరుగుపరచాలి అనే అంశం చర్చకు వచ్చింది. టెస్టింగ్ ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేసేలా చూసుకోవాలని విమానాశ్రయాలు, ఓడరేవుల్లోని ఆరోగ్య అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎమ్హెచ్ఏ.
ఈ భేటీలో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ విజయ్ రాఘవన్‌తో పాటు ఆరోగ్య, విమానయాన, ఇతర మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
'సిద్ధంగా ఉండండి'
దేశానికి కరోనా కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉన్న తరుణంలో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది(omicron news in India). ఒమిక్రాన్ నియంత్రణ కోసం విస్త్రతంగా సన్నద్ధమవ్వాలని, ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆరోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను పెంచాలని స్పష్టం చేసింది.
వైరస్ కట్టడికి చేపట్టాల్సిన చర్యలను వివరిస్తూ.. కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు శనివారం లేఖ రాశారు. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా పెట్టాలని, కొవిడ్ నమూనాలను వేగంగా ల్యాబ్‌లకు తరలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. వైరస్ కట్టడికి ప్రజలు.. నిబంధనలు పాటించే విధంగా చూసుకోవాలని స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ కేసులు బయటపడిన దేశాలను ముప్పు ప్రాంతాలుగా గుర్తించామని, అక్కడి నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులపై మరిన్ని నిబంధనలు విధించే అవకాశముందని లేఖలో భూషణ్ పేర్కొన్నారు. పలు రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గిపోయిందని, కొత్త వేరియంట్‌ను గుర్తించేందుకు టెస్టింగ్‌ను ఉద్ధృతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు.
ఇదీ చూడండి:-