గత రెండున్నరేళ్లుగా కరోనా కొత్త వేరియంట్లు పుట్టుకువస్తూ ఒకదాని తర్వాత ఒకటి కొవిడ్ ఉద్ధృతులకు కారణమవుతున్నాయి. తాజాగా ఒమిక్రాన్ నుంచి రెండు కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి. BA.7, BA.5.1.7 వేరియంట్లు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవి డెల్టా అంత ప్రమాదకరం కాకపోయినా.. వేగంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీపావళి సెలవుల కారణంగా ఈ కొత్త వేరియంట్ల వల్ల దేశంలో మరో వేవ్‌కు దారి తీసే ప్రమాదం నిపుణుల హెచ్చరిస్తున్నారు.
BF.7ను తొలుత వాయవ్య చైనా.. మంగోలియా అటానామస్ రీజియన్‌లో గుర్తించారు. ఆ తర్వాత ఇది అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, బెల్జియం తదితర దేశాలకు పాకింది. భారత్‌లో కూడా దీన్ని గుర్తించారు. చైనాలో కొవిడ్ కేసులు పెరగడానికి ఈ కొత్త వేరియంట్లే కారణమని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు.
ఇతర ఒమిక్రాన్ వేరియంట్ల కంటే BF.7 వేరియంట్.. టీకాలు, గతంలో కొవిడ్ సోకడం వల్ల వచ్చిన వ్యాధి నిరోధకతను ఏమార్చుతుందని ఇప్పటికే రెండు అధ్యయనాలు వెల్లడించాయి. వచ్చే రెండు, మూడు వారాలు చాలా కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కొత్త వేరియంట్ల వల్ల కొవిడ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో పండగల సమయంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వేరియంట్లు గత వేరియంట్లతో పోల్చితే వేగంగా వ్యాపించడమే అందుకు కారణం. ఒమిక్రాన్ BF.7 లక్షణాలు గత వేరియంట్ల మాదిరిగానే ఉంటాయి. గొంతు నొప్పి, అలసట, దగ్గు, ముక్కు కారటం వంటి లక్షణాలు ఉంటాయి.