దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భాగంగా ఇతర దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అనుమతిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే వెల్లడించింది. ఇందుకు ఆయా టీకాల సామర్థ్యాలను పరిశీలించి దేశంలో వినియోగించుకుంటామని తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం, ప్రైవేటు మార్గాల ద్వారా టీకా పంపిణీ చేయవచ్చని పేర్కొంది. అయితే, తాము సరఫరా చేయబోయే టీకాను ప్రభుత్వ మార్గాల ద్వారానే పంపిణీ చేస్తామని అమెరికాకు చెందిన ఫైజర్ సంస్థ తాజాగా వెల్లడించింది.
సంప్రదింపులు జరుపుతాం...
ఎలాంటి లాభాపేక్ష లేకుండానే తమ టీకాను భారత ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఫైజర్ యాజమాన్యం ప్రకటించింది. ఈ విషయంపై భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో పేద, మధ్య, ధనిక ఆదాయ దేశాలకు అనుగుణంగా తాము వివిధ ధరలను నిర్ణయిస్తున్నామని ఫైజర్ యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే టీకా ధర ఎంతనే విషయాన్ని మాత్రం ఫైజర్ వెల్లడించలేదు. ప్రస్తుతం అమెరికాలో ఫైజర్ టీకా ఒక డోసు ధర 19.5డాలర్లుగా ఉంది.
వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని..
ఇదిలాఉంటే, భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు ఇప్పటికే వివిధ దేశాల్లో ఆమోదం పొందిన టీకాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌లో ఇప్పటికే రెండు దేశీయ టీకాలు అనుమతులు పొందగా.. రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కూడా ఈమధ్యే ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విదేశీ సంస్థలు భారత్‌లో కరోనా టీకాను సరఫరా చూపేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇక అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకా 95శాతం సమర్థత కలిగినట్లు వెల్లడైన విషయం తెలిసిందే. భారత్‌లో వెలుగు చూసిన కొత్తరకం కరోనా వేరియంట్‌పై ఫైజర్ టీకా పాక్షికంగా పనిచేస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ ఈమధ్యే వెల్లడించింది.
ఇదీ చూడండి: కరోనాతో తల్లి మృతి- బాధతో కుమార్తె ఆత్మహత్య!
ఇదీ చూడండి: 'నిధులున్నా టీకా ఉచితంగా ఇవ్వరేం?'