సమాజంలో అర్థవంతమైన మార్పే లక్ష్యంగా యువత ముందుకు సాగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పిలుపునిచ్చారు. దేశంలోని సమస్యలకు వారే పరిష్కారం చూపాలన్నారు. జాతి నిర్మాణంలో యువతదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. వారి ఆలోచనలు నిస్వార్థంగా, సాహసోపేతంగా ఉంటాయని, నమ్మిన సిద్ధాంతాల కోసం త్యాగాలకు సిద్ధంగా ఉంటారన్నారు. ప్రపంచం విసురుతున్న సవాళ్లను అధిగమించేలా విద్య, సమకాలీన అంశాలపై వారు దృష్టి సారించాలన్నారు. యువత ఆర్థికంగా విజయం సాధించినా కుటుంబ విధులు, సామాజిక బాధ్యత, జాతి అవసరాలను విస్మరించరాదన్నారు. యువ న్యాయవాదులవి వైవిధ్యమైన ఆలోచనలని, అవి ఎంతో శక్తిమంతంగా ఉన్నాయని తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా తాను అనేక మందితో మాట్లాడుతున్నపుడు ఇవి స్పష్టమయ్యాయని చెప్పారు. హైదరాబాద్‌లోని వివేకానంద మానవ వికాస కేంద్రం 22వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో జస్టిస్ ఎన్.వి.రమణ ప్రసంగించారు.
"భారతదేశం బలమైన ఆర్థిక వ్యవస్థగా వేగంగా అభివృద్ధిపథంలో ముందుకు వెళ్తోంది. దేశంలోని యువశక్తి మనకు గొప్ప బలం. దేశ జనాభాలో 45 శాతానికి పైగా ఉన్నారు. వారు ఆత్మవిశ్వాసంతో ఆవిష్కరణలు, సరికొత్త ఆలోచనలను అమలు చేయవచ్చు. అవరోధాన్ని బలంగా, అవకాశంగా భావించి ముందుకు వెళ్లాలి. స్వామి వివేకానంద చెప్పినట్లు సమస్యలు లేకుండా ముందుకు సాగుతున్నామని భావిస్తే.. మనం సరైన మార్గంలో వెళ్తున్నట్లు కాదని గుర్తించాలి."
-సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ
విద్యాసంస్థలది గురుతర బాధ్యత..
యువ శక్తి నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత విద్యాసంస్థలకు ఉంది. విద్యాలయాల్లో హక్కులతో పాటు పరిమితులనూ నేర్పించాలి. చట్టాన్ని గౌరవించడంతో పాటు న్యాయబద్ధత అనే సంస్కృతిని పెంపొందించుకునేలా దోహదపడాలి. యువత గ్రామీణ జీవన పరిస్థితులను తెలుసుకునేందుకు గ్రామాలకు వెళ్లాలి. నగరాల్లో మురికివాడలను సందర్శించాలి. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన నేను చదువుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఇప్పుడు అనేక వనరులు అందుబాటులో ఉన్నాయి. విశ్వంలోని సమస్త సమాచారం మన అరచేతిలోకి వచ్చింది. ఇదే సమయంలో అనుకూలతలతో సమస్యలు ఉన్నాయని గుర్తించి అప్రమత్తంగా ఉండాలి.
వివేకానంద బోధనలు చిరస్మరణీయం..
స్వామి వివేకానంద బోధించిన అంశాలు చిరస్మరణీయం. ప్రేమ, వాత్సల్యం, సమానత్వం అనే మూడు సూత్రాల ప్రాతిపదికగా ఉండే భారతీయ ఆధ్యాత్మికత ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. వివేకానంద షికాగో ప్రసంగానికి శనివారంనాటితో 129 ఏళ్లు పూర్తయింది. వివేకానంద మానవ వికాసం కేంద్రం స్వయం ఉపాధి, వైవిధ్యమైన కోర్సులతో ముందుకు వెళ్తోంది. ఇప్పటిదాకా ఈ సంస్థ 19 లక్షల మందికి శిక్షణ అందించడం అభినందనీయం. యువత జీవితాలను మలచుకునేందుకు ఇది కీలకంగా వ్యవహరిస్తోంది.
ఎందరో త్యాగాల ఫలం.. నేటి స్వేచ్ఛ..
"నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు.. స్వాతంత్య్ర సమరంలో ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితమే. యువశక్తికి మన చరిత్ర సాక్ష్యం. ఆంగ్లేయులపై గిరిజనులను ఐక్యం చేసి పోరాడిన బిర్సా ముండా, యువ యోధులు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బానిస సంకెళ్ల నుంచి భరతమాతకు విముక్తి కలిగించేందుకు కడదాకా పోరాడారు" అని సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ వివరించారు. వెబినార్‌లో బేలూరు రామకృష్ణామఠం ఉపాధ్యక్షులు గౌతమానంద, ప్రధానకార్యదర్శి సువిరానంద, హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు జ్ఞానదానంద, వివేకానంద మానవ వికాస కేంద్రం సంచాలకులు బోధమయానంద పాల్గొన్నారు.
ఇవీ చదవండి: