National herald case: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. నరేంద్ర మోదీకి, ఈడీకి తాను భయపడనని అన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ వ్యవహారంతో సంబంధం ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఈడీ బుధవారం సీల్ చేసిన నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ బెదిరింపు ప్రయత్నాలు అని అన్నారు.
"మోదీ ప్రభుత్వం కోరుకున్నది చేసుకోవచ్చు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటా. సత్యానికి అడ్డుకట్ట వేయలేం. ఏదైనా చేసుకోండి. నేను ప్రధానికి భయపడను. దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తాను. మాపై ఒత్తిడి చేయడం ద్వారా మమ్మల్ని ఆపవచ్చని అనుకుంటున్నారు. మేము మౌనంగా ఉండం. మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఏం చేసినా అడ్డుగా నిలబడతాం."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేకు ఈడీ సమన్లు జారీ చేయడం దుమారం రేపింది. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయం ప్రస్తావించారు ఖర్గే. కాంగ్రెస్ను భాజపా భయపెట్టాలని చూస్తోందని.. అయితే దీనికి భయపడబోమని అన్నారు.
'ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రం.. దర్యాప్తు సంస్థలను వాడుతోంది. ఈడీ చర్యలపై కేంద్రం సమాధానం చెప్పాలి. నాకు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ నుంచి సమన్లు అందాయి. నేను చట్టానికి లోబడి ఉంటాను.. కానీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఈడీ విచారణకు పిలవడం సరైనదేనా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నివాసాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎంత వరకు సబబు? మేం భాజపాకు భయపడం. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడతాం."
-మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నేత
పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్.. ఈడీ చర్యలను ప్రస్తావించింది. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. పార్లమెంట్ ఉభయసభల్లోనూ వాయిదా తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. అయితే.. ఈ వ్యవహారంపై చర్చకు రెండు సభల సభాపతులు అంగీకరించకపోగా.. కాంగ్రెస్ సభ్యులు నిరసనకు దిగారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్.. ఖర్గే ప్రశ్నకు కౌంటర్ వేశారు. చట్టాన్ని అమలుచేసే సంస్థల కార్యకలాపాల్లో కేంద్రం జోక్యం చేసుకోదని.. కాంగ్రెస్ చట్టాన్ని ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. సభను సజావుగా సాగేలా చూడటం కోసం.. ఖర్గే విచారణకు హాజరుకావాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ హయాంలో జోక్యం చేసుకున్నట్లుగా కనిపిస్తుందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ సభ్యుల నిరసనల మధ్య ఉభయసభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
విచారణకు హాజరైన ఖర్గే: నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఈడీ సమన్ల నేపథ్యంలో విచారణకు హాజరయ్యారు ఖర్గే. మరోవైపు.. బుధవారం సీజ్ చేసిన యంగ్ ఇండియన్ కార్యాలయంలో గురువారం కూడా సోదాలు కొనసాగించింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్.
కాంగ్రెస్ ఆందోళన ఉద్ధృతం.. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగించనుంది. బుధవారం దేశవ్యాప్తంగా ప్రదర్శనలు, ధర్నాలు నిరహించిన కాంగ్రెస్ నేతలు.. శుక్రవారం కూడా కొనసాగించనున్నారు. అన్ని రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేపట్టాలని ఇప్పటికే పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈనెల 5 నుంచి 11 వరకు రోజూ వివిధ రూపాల్లో నిరసన చెప్పాలని కార్యచరణ రూపొందించింది కాంగ్రెస్. శుక్రవారం పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్కు కాంగ్రెస్ ఎంపీలు పాదయాత్ర చేయనున్నారు.
ఇవీ చదవండి: 'కొవిడ్ టీకా ఓ ఫెయిల్యూర్'.. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
రూ.1400 కోట్ల 'మ్యావ్ మ్యావ్' డ్రగ్స్ సీజ్.. కేరళలో 8వేల జిలెటిన్ స్టిక్స్