రానున్న శాసనసభ ఎన్నికల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎవరికీ మద్దతు ఇవ్వరని శనివారం రజనీ మక్కల్ మండ్రం రాష్ట్ర నిర్వాహకుడు సుధాకర్ పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో రజనీ రాజకీయాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో మక్కల్‌మండ్రం నిర్వాహకులు, అభిమానులు వారికి నచ్చిన పార్టీల్లో చేరవచ్చని మక్కల్ మండ్రం తరఫున ప్రకటించారు.
"రానున్న ఎన్నికల్లో రజనీ ఏ పార్టీకి మద్దతివ్వరు. ఇది 100 శాతం నిజం. అర్జున మూర్తి, రజనీ కలిసి పార్టీ ఏర్పాటు చేస్తారనేది అసత్యం. రజినీ సతీమణి లత పార్టీ పెట్టబోతున్నారనేది తప్పుడు వార్త."
-- సుధాకర్, రజినీ మక్కల్ మండ్రమ్ కార్యదర్శి.
అయితే మక్కల్ మండ్రం జిల్లా కార్యదర్శులు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో మక్కల్ మండ్రం నిర్వాహకులు డీఎంకే, భాజపా సహా ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ఈ క్రమంలో రజనీ మక్కల్ మండ్రం రాష్ట్ర నిర్వాహకుడు జిల్లా కార్యదర్శులతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. రజనీకాంత్ రానున్న ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు.
లతా రజనీకాంత్ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని పేర్కొన్నట్లు సమాచారం. అర్జునమూర్తి పార్టీ ప్రారంభిస్తే ఆయన పార్టీకి రజనీమక్కల్ మండ్రానికి ఎటువంటి సంబంధం లేదని వివరించారని మండ్రం కార్యదర్శులు శనివారం చెప్పారు.
ఇదీ చదవండి:గుజరాత్ ప్రజల మనసు గెలుచుకుంటాం: ఓవైసీ