అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా తనను ఏ కుట్రలూ నిలువరించలేవన్నారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భాజపాతో పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.
నందిగ్రామ్ ఘటన తర్వాత తొలిసారి పురులియా జిల్లా ఝల్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మమత. తన స్వరం, గుండె పనిచేసినంత కాలం పోరాటం కొనసాగిస్తానన్నారు.
" కొన్ని రోజుల్లోనే నా కాళ్లు బాగవుతాయి. బంగాల్ గడ్డపై మీరు స్వేచ్ఛగా తిరుగుతారో లేదో నేనూ చూస్తాను. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా నేతలు దిల్లీ నుంచి వస్తున్నారు. కానీ, మీరు బంగాల్‌ను దక్కించుకోలేరని చెబుతున్నా. టీఎంసీ ప్రభుత్వం పనిచేసినట్లుగా ప్రపంచంలోనే ఏ సర్కారు పనిచేయలేదు. ప్రధానమంత్రికి దేశాన్ని నడిపించే సామర్థ్యం లేదు. "
- మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి.
టీఎంసీ ప్రభుత్వం అధికారాన్ని నిలబెట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు మమత. 'మీకు ఉచిత రేషన్ కొనసాగుతుంది. ఇంటి వద్దే రేషన్‌ను అందిస్తాం. మే తర్వాత మీరు చౌకధరల దుకాణానికి రావాల్సిన అవసరం లేదు'అని పేర్కొన్నారు మమత. భాజపా, కాంగ్రెస్, సీపీఎంకు వ్యతిరేకంగా ' భాజపా వద్దు, కాంగ్రెస్ వద్దు, సీపీఎం వద్దు, భాజపాకు వీడ్కోలు చెప్పండి.. ' అంటూ నినాదాలు చేశారు.
ఇదీ చూడండి: నామినేషన్ వేసిన పళనిస్వామి, స్టాలిన్