NITI AAYOG MEETING 2022: ట్రేడ్ (వాణిజ్యం), టూరిజం (పర్యాటకం), టెక్నాలజీ (సాంకేతికత) అనే మూడు 'టి'లను ప్రోత్సహించడంపై రాష్ట్రాలు దృష్టి కేంద్రీకరించాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. దిగుమతులను తగ్గించుకుని, ఎగుమతులను పెంచేందుకు ఇది అవసరమని చెప్పారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్ సెంటర్‌లో జరిగిన నీతి ఆయోగ్ పాలకమండలి ఏడో సమావేశంలో ముఖ్యమంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సాంకేతికతను వినియోగించుకుని వ్యవసాయ రంగాన్ని ఆధునికీకరించడం ద్వారా స్వయంసమృద్ధి సాధించి, ప్రపంచానికి నేతగా మన దేశం అవతరించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయంతో పాటు పశు సంవర్ధక, ఆహారశుద్ధి పరిశ్రమ రంగాలనూ ఆధునికీకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. వీలైన చోట్ల స్థానిక వస్తువులనే వాడాలని, 'వోకల్ ఫర్ లోకల్' నినాదం కేవలం ఒక రాజకీయ పార్టీది కాదని, అది అందరి ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. శీఘ్రగతిన సాగుతున్న పట్టణీకరణను బలహీనతగా కాకుండా మన దేశ బలంగా మలచుకోవాలని చెప్పారు.
"ఈ సమావేశంలో చర్చించిన అంశాలు వచ్చే 25 ఏళ్లకు దేశ ప్రాధాన్యాలను నిర్దేశిస్తాయి. ఈరోజు నాటే విత్తనాలు 2047లో భారత్ అందుకొనే ఫలాలను నిర్వచిస్తాయి" అని మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘ చర్చల తర్వాతే జాతీయ విద్యా విధానం తీసుకొచ్చామని, అమలుకు స్పష్టమైన సమయంతో మార్గసూచీ తయారు చేయాలని సూచించారు. రాష్ట్రాలు సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శిస్తూ కలిసికట్టుగా పనిచేయడం వల్లే కొవిడ్ మహమ్మారి నుంచి మన దేశం బయటపడగలిగిందని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాలు భారత్‌ను 'ప్రపంచ నేత'గా చూసే పరిస్థితి వచ్చిందన్నారు.
జి-20 కోసం ప్రత్యేక బృందాలు..
2023లో జి-20 సదస్సుకు మన దేశం నాయకత్వం వహించబోతున్న విషయాన్ని ప్రధాని ఈ సమావేశంలో ప్రస్తావించారు. భారత్ అంటే దిల్లీ ఒక్కటే కాదు.. విభిన్న రాష్ట్రాల సమాహారం అని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇదో అరుదైన అవకాశమని పేర్కొన్నారు. జి-20 చుట్టూ ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని, దేశంలో అత్యుత్తమ ప్రతిభావంతులను గుర్తించడానికి దీన్నో అవకాశంగా మలుచుకోవాలని కోరారు. గరిష్ఠస్థాయిలో ప్రయోజనం పొందేందుకు ప్రతి రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా జి-20 బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు తమ ప్రాధాన్యాలు, సాధించిన విజయాలు, ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి వివరించారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రత్యక్షంగా జరిగిన ఈ తొలి సమావేశానికి 23 మంది ముఖ్యమంత్రులు, ముగ్గురు లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రులు- కేసీఆర్, ఎంకే స్టాలిన్, నీతీశ్‌కుమార్, అరవింద్ కేజ్రీవాల్ హాజరుకాలేదు. పప్పుధాన్యాలు, నూనెగింజల విషయంలో కనీస మద్దతు ధర విధానాన్ని మరింత ప్రభావవంతంగా మలచాలని పలు రాష్ట్రాలు డిమాండ్ చేశాయి. నిర్ణయాలను తమపై బలవంతంగా రుద్దవద్దని భాజపాయేతర పార్టీలు అధికారంలో ఉన్న కొన్ని రాష్ట్రాల సీఎంలు విజ్ఞప్తి చేశారు.
నిజాయతీ గల మధ్యవర్తిలా పనిచేస్తాం: నీతి ఆయోగ్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏదైనా ప్రతిష్టంభన నెలకొన్నప్పుడు దాన్ని పరిష్కరించడానికి నీతి ఆయోగ్ నిజాయతీ గల మధ్యవర్తిలా పనిచేస్తుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్‌బేరి, సీఈఓ పరమేశ్వరన్, సభ్యుడు వీకే పాల్ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో నీతి ఆయోగ్ అంబుడ్స్‌మన్‌లా వ్యవహరించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేసిన డిమాండ్ గురించి విలేకర్లు అడిగినప్పుడు వారు ఈ విధంగా స్పందించారు. "నీతి ఆయోగ్ ముఖ్య ఉద్దేశం సహకారపూర్వక, పోటీతత్వ సమాఖ్య వ్యవస్థను ప్రోత్సహించడమే. నీతి ఆయోగ్‌ను రాష్ట్రాలు తమ స్నేహితుడిగా చూస్తున్నాయని భావిస్తున్నాం. మేం వారధిలా పనిచేస్తాం" అన్నారు.
ఇవీ చదవండి: 'పార్లమెంటు నిష్క్రియంగా మారింది.. ప్రజాస్వామ్యం అతి కష్టంగా ఊపిరి పీల్చుకుంటోంది'
భారత జలాల్లోకి పాక్ యుద్ధనౌక.. తరిమికొట్టిన కోస్ట్‌గార్డ్ 'డోర్నియర్'