Newly Constructed Road Damaged in Alluri District: భూకంపం వచ్చి బీటలు వారిందా అన్నట్టుగా రహదారి చీలిపోయింది. సరిగ్గా అధ్యయనం చేయకుండా, తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలు తీసుకోకుండా జరిగిన నిర్మాణానికి వరద వల్ల చెదిరిపోయిన రోడ్డే అద్దం పడుతోంది. సాధారణంగా కొత్తగా కొండకొనల్లో లూజు మట్టి ఉన్నప్పుడు అనుసరించాల్సిన ఇంజినీరింగ్ ప్రమాణాలు గాని, ఇతరత్రా జాగ్రత్తలు కాని కనీసస్థాయిలోనూ తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది. కనీసం రహదారి లేకుండా బతుకులు నెట్టుకొస్తున్న.. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలోని అత్యంత మారుమూల పంచాయతీ రంగబయలు, జోడిగుమ్మ, కొసంపుట్టు వంటి గ్రామాల ప్రజలకు రోడ్డు ధ్వంసం కావటంతో మళ్లీ కష్టాలు మొదటికొచ్చాయి.
పీఎంజీఎస్వై కింద ఆశరాడ నుంచి జోడిగుమ్మ వరకు మొత్తం 22 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 16 కోట్లు మంజూరు చేసి పక్కాగా నిర్మాణం చేపట్టారు. ఇటీవల రోడ్డు పనులు కొలిక్కి వచ్చాయి. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆశరాడ- జోడిగుమ్మ రహదారి మట్టిగుడ సమీపం నుంచి కొసంపుట్టు మార్గం మధ్యలో చాలాచోట్ల కోతకు గురైంది. దాదాపు మూడు కిలోమీటర్ల దారిలో రోడ్డు ఎక్కడికక్కడ ముక్కలు అయిపోయింది. రహదారికి గండిపడి జోడిగుమ్మ, కొసంపుట్టు, ముండిగుడ, పట్నాపడాల్‌పుట్ తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
దశాబ్దాలుగా రహదారి లేక నానా అవస్థలు పడుతున్న గిరిజన గ్రామాల ప్రజలు.. రహదారి నిర్మాణం పూర్తి అయిందని సంబరపడుతున్న వేళ.. మొదటి వర్షానికే రహదారి మొత్తం దెబ్బతినడం నిశ్చేష్టులను చేసింది. డోలీ మోతలు తప్పాయి అనుకునేలోపే రహదారి కోతకు గురికావడంతో తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
"జోడిగుమ్మ వెళ్లే ఘాట్ రోడ్డు పాడైపోయింది. అందువల్ల మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఏదైనా వాహనాలు రావాలంటే రాలేని పరిస్థితి ఎదురైంది. మొదటి వానకే ఇలా మారిపోతే.. పెద్ద తుఫాను వస్తే కనీసం ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోతుంది." -శ్రీను, గిరిజనుడు
ఇటీవలే వైసీపీ నేతలు వనుగుమ్మ గ్రామాన్ని సందర్శించి 75 ఏళ్ల కల నెరవేరుతోందని ప్రకటనలు గుప్పించారు. మంగళవారం రహదారి దెబ్బతిన్న విషయం తెలుసుకుని వనుగుమ్మ, రంగబయలు ఎంపీటీసి సభ్యురాలు భాగ్యవతి కోతకు గురైన రహదారిని పరిశీలించారు. రహదారి కోతకు సంబంధిత గుత్తేదారు, పీఆర్ ఇంజినీర్లే బాధ్యత వహించాలని అన్నారు. అధికారులు స్పందించి వెంటనే మరమ్మతులు చేయాలని కోరారు.
"రోడ్డు ఏర్పాటు చేశారని ఎంతో సంబరపడిపోయాము. కానీ, మొదటి వానకే పాడైపోవడం చాలా బాధకరంగా ఉంది. జోడిగుమ్మ, కొసంపుట్టు వద్ద రోడ్డు బాగా కొట్టుకుపోయింది. అత్యవసర సమయంలో ఇటు నుంచి రాలేని పరిస్థితి ఏర్పడింది. కాంట్రాక్టరు పనులు సరిగా చేపట్టలేదు. మా కష్టాలు మళ్లీ మొదటికే వచ్చాయి." -భాగ్యవతి, ఎంపీటీసీ సభ్యురాలు
జోడిగుమ్మ రహదారి ఘాట్ రోడ్ కావడం వల్ల భారీ వర్షానికి మట్టికుంగి రోడ్డు దెబ్బతిందని.. అధికారులు చెబుతున్నారు. రహదారికి ఇరువైపులా సీసీ రోడ్లు, మలుపుల వద్ద రక్షణ గోడలు నిర్మించాల్సి ఉందన్నారు. మొత్తం మరమ్మతులు చేయిస్తామని తెలిపారు.