New Purohits For Ayodhya Ram Mandir : ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మిస్తున్న రామమందిరంలో జనవరి 22న రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగనుంది. ఈనెల 15లోగా గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి చేసేలా పనులు నడుస్తున్నాయి. జనవరి 21 నుంచి 23 వరకు జరగనున్న రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తం 25 వేల మందిని ఆహ్వనించనున్నట్లు ట్రస్టు ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే వారణాసి నుంచి అయోధ్యకు కొంతమంది అర్చకులు వచ్చినట్లు తెలిసింది.
నిత్యం రామాలయంలో పూజలు చేసేందుకు యువ అర్చకులను కూడా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఎంపిక చేసింది. 20 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ఇవ్వగా 3వేలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అభ్యర్థులందరికీ రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి 22 మంది అర్హులను ఎంపిక చేసింది. గుడిలో వివిధ పూజలు చేసేందుకు 20 నుంచి 30ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్చకుల్ని ఎంపిక చేసినట్లు తెలిపింది.
బస సౌకర్యం.. రూ.2వేల పారితోషికం..!
వారందరికీ గురువారం నుంచి ఉచితంగా 6 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. వారికి ఆ సమయంలో బస సౌకర్యం కల్పిస్తారు. నెలకు రూ.2వేలు చొప్పున పారితోషికం కూడా అందిస్తారు. అయోధ్య రామాలయంలో అర్చకులుగా సేవలు అందించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నామని ఎంపికైన యువ అర్చకులు తెలిపారు. ఆరు నెలల శిక్షణ పూర్తయిన తర్వాత తుది పరీక్షలు నిర్వహించి 20 మందిని ఎంపిక చేస్తామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
గత 7 ఏళ్లుగా..
ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లోని శ్రీ దుధేశ్వరనాథ్ మఠం ఆలయానికి చెందిన శ్రీ దుధేశ్వర్ వేద్ విద్యాపీఠ్ సంస్థాన్‌లో విద్యార్థిగా ఉన్న మోహిత్ పాండే అనే అర్చకులు అయోధ్యలోని శ్రీరామ మందిరంలో పూజారిగా ఎంపికయ్యారు. ఆరు నెలల పాటు ఈయనకు శిక్షణ ఇచ్చి ఆలయంలో పూజారిగా నియమిస్తారు. మోహిత్ పాండే గత 7 సంవత్సరాలుగా పౌరహిత్యం చేస్తున్నారు.
వారికోసం టిన్షెడ్స్..
వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న అయోధ్య రామమందిరానికి ఇప్పటికే భక్తులు పోటెత్తుతున్నారు. అయితే ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని వీరికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఆలయానికి భక్తులు తాకిడి పెరిగినా వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా వచ్చినవారిలో కనీసం 10 నుంచి 15 వేల మంది వరకు భక్తులు బస చేసేలా అన్ని వసతులతో కూడిన తాత్కాలికమైన టిన్షెడ్స్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్. ఇందుకోసం 2024 ఫిబ్రవరి నెలాఖరులోగా నూతన టిన్‌షెడ్ సిటీని ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల సాయం కూడా తీసుకుంటామని ఆయన చెప్పారు.
అక్కడ నుంచి నెయ్యి.. ఇక్కడ నుంచి పసుపు..!
శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే పూజ కోసం ప్రత్యేకంగా 600 కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని గురువారం ఉదయం ఎద్దుల బండిలో ప్రత్యేక పూజల నడుమ అయోధ్యకు తీసుకువచ్చారు. దీనిని రాజస్థాన్‌లోని జోధ్‌పుర్ నుంచి తెప్పించారు. అంతేకాకుండా పూజ క్రతువులో ఎంతో ముఖ్యంగా వినియోగించే పసుపును ఆసియా దేశం కంబోడియా నుంచి తెప్పించారు.
బాలరాముడి విగ్రహ సెలక్షన్ అప్పుడే- సచిన్, కోహ్లీ, అంబానీకి ఆహ్వానం- బార్కోడ్ ద్వారా ఎంట్రీ!
అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానాలు- పోస్ట్ ద్వారా 4వేల మంది సాధువులకు ఇన్విటేషన్